తక్షణ చర్యలు చేపట్టండి
– రైతులకు పెట్టబడి రాయితీ అందజేయండి
– అధికారులకు మంత్రి కాలవ ఆదేశం
– కలెక్టర్‌తో కలిసి అధికారులతో సమావేశం
అనంతపురం సిటీ : రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో గురువారం కలెక్టర్ జి.వీరపాండియన్, వ్యవసాయ శాఖ, బ్యాంక్, బీమా కంపెనీ అధికారులతో మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. ఖాతాల్లో జమ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో 24 గంటల పాటు పనిచేసేలా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని చెప్పారు.
జేసీ–2 ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, బ్యాంకులు, బీమా కంపెనీల ప్రతినిధులు సంయుక్తంగా కమాండ్ కంట్రోల్ రూంలో పని చేయాలన్నారు. ప్రీమియం చెల్లించిన రైతుల డేటాను మ్యాచింగ్ చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాలని బీమా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇన్పుట్ సబ్సిడీ జమ చేసే క్రమంలో నెలకొన్న జాప్యాన్ని అరికట్టాలన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని పక్కగా రైతుల జాబితా రూపొందించి వారి ఖాతాల్లోకి నగదు జమ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, జేడీఏ శ్రీరామ్మూర్తి, ఎల్డీఎం జయశంకర్, బజాజ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు జగదీశ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.