తాంత్రికుడితో సీఎం భేటీ!
♦ వీడియో విడుదల చేసిన బీజేపీ
♦ మహాకూటమిపై నిప్పులు
♦ మంత్ర తంత్రాలతో గెలవరన్న కేంద్ర మంత్రి జైట్లీ
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ తాంత్రికుడిని కలిసిన వీడియో ఎన్నికల ప్రచారంలో సంచలనం సృష్టిస్తోంది. ఓ జేడీయూ ఎమ్మెల్యే అభ్యర్థితో కలసి నితీశ్ క్షుద్ర విద్యలను ఆచరించే గురువు దగ్గరకు వెళ్లి.. ఆయన పక్కన కూర్చున్న వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో వైరస్‌లా పాకిపోయింది. బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ ఈ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నితీశ్.. ఓ తాంత్రికుడి పక్కన కూర్చుని ఉన్నారు. ‘ఆర్జేడీ అధినేత లాలూతో మీరెందుకు కలిశారు. మీరు ఒంటరిగా పోటీ చేస్తే బాగుండేది. నితీశ్ జిందాబాద్.. లాలూ ముర్దాబాద్’ అని ఆ తాంత్రికుడు నితీశ్‌ను ఆశీర్వదించి హత్తుకున్నట్లు వీడియోలో కనబడుతోంది.
లాలూ పీడ వదిలించుకునేందుకే నితీశ్.. ఆ తాంత్రికుడిని కలిశారని బీజేపీ విమర్శించింది. బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రిపై విమర్శలు చేస్తూ.. ‘కొన్ని శక్తులను రాష్ట్రం నుంచి బయటకు పంపించేందుకు ఏమేం చేయాలో తమకు తెలుస’ని లాలూ చేసిన వ్యాఖ్యలను గిరిరాజ్ సింగ్ గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు తాంత్రికులను సంప్రదించటం సిగ్గుచేటని నితీశ్‌పై విరుచుకుపడ్డారు. పరిస్థితి సరిగా లేనప్పుడు మంత్ర, తంత్రాలు పనిచేయవని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. పరోక్షంగా నితీశ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
ప్రధాని పదవినే అవమానించారు
ఎన్నికల ప్రచారంలో ప్రధాని అనుచిత భాష వాడి ఆయన పదవినే కించపరిచారని నితీశ్ కుమార్ విమర్శించారు. ‘సైతాన్, అహంకారి’ వంటి పదాలను వాడటం ప్రధాని స్థాయికి మంచివి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని.. దేశంలో 300 జిల్లాలకు పైగా కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఉందన్నారు. హరియాణాలో దళిత బాల సజీవ దహనంపై ప్రధాని నోరు ఎందుకు మెదపటం లేదని ప్రశ్నించారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా మోదీ పెదవి విప్పలేదని.. పైగా గాంధీ ఆలోచనలు పాటించాలని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ‘బిహార్‌లో జంగిల్ రాజ్ అని విమర్శిస్తున్న వారు.. హరియాణాలో మంగళ్ రాజ్(సుపరిపాలన) ఉందా? సమాధానం ఇవ్వాల’ని ఓ ఎన్నికల సభలో డిమాండ్ చేశారు.
మాంఝీనే సీఎం అని చెప్పలేదే: షా
‘బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే.. నేనే సీఎం అవుతాన’న్న హిందుస్థానీ అవామీ మోర్చా చీఫ్, మాజీ సీఎం జితన్ రాం మాంఝీ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. మాంఝీకి అలాంటి భరోసాలేమీ ఇవ్వలేదని ఓ టీవీ చానల్‌తో అన్నారు. సీఎం ఎవరినీ ప్రతిపాదించకపోవటంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. బీజేపీది టీమ్ వర్క్ అని.. మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో.. పార్టీ గెలిచాకే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసిన విషయాన్ని గుర్తుచేశారు.