మహిళా రిపోర్టర్‌ను అసభ్యంగా తిట్టిన ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఓ మీడియాకు చెందిన మహిళా ప్రతినిధిని కర్ణాటక ఎమ్మెల్యే అశోక్ ఖేని ఇష్టమొచ్చినట్లు తిట్టేశాడు. ఓ సమాచారం సంబంధించి ఆమె ఆయనను ప్రశ్నించగా 'దీనిని అరెస్టు చేయండి' అంటూ అసభ్య పదజాలం ఉపయోగించాడు. ఈ నేపథ్యంలో ఆయనను లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే,క్షమాపణ చెప్పేందుకు అంగీకరించిన ఆయన ముందు ఆ రిపోర్టర్ క్షమాపణ చెబితేనే తాను చెబుతానని అన్నాడు. కర్ణాటకలో రాజ్యసభ సీట్ల విషయంలో అవినీతి జరిగిన విషయంపై టైమ్స్ నౌ ముంబయి బ్యూరో-చీఫ్ మేఘా ప్రసాద్ ఆయనను ప్రశ్నించగా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'అరెస్ట్ కరో సాలీకో' (దీనిని అరెస్టు చేయండి) అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ డైలాగ్ లు ప్రత్యక్షంగా వీడియోలో రికార్డయ్యాయి. అనంతరం సోషల్ మీడియాలోకి ఎక్కాయి. ఈ విషయాన్ని తాము అంత తేలికగా వదిలిపెట్టాలనుకోవడం లేదని, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాంటి భాష ఉపయోగించి మాట్లాడాడో అందరికీ తెలియజేయాలని నిర్ణయించుకున్నామని టైమ్స్ నౌ తెలిపింది. ఈ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి సదరు ఎమ్మెల్యే లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా అందుకు అంగీకరించాడు. అయితే, ముందు ఆ రిపోర్టర్ చెబితేనే తాను క్షమాపణ చెబుతానని చెప్పాడు.