ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
గుత్తి : అనారోగ్యంతో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థిని జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. గుత్తిలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ చాంద్‌బాషా తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో నివాసముండే ఉసేని (టీచర్), రంగమ్మ దంపతుల కుమార్తె ప్రీతి మేఘన. కర్నూలులోని శ్రీచైతన్య కాలేజీలో బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. ఆరు మాసాల క్రితం అనారోగ్యానికి గురైంది. తల నుంచి కాళ్ల వరకు విపరీతమైన నొప్పులతో బాధ పడేది. అంతే కాకుండా నరాల బలహీనత కూడా మొదలైంది.
కర్నూలు, బళ్లారి, అనంతపురంతోపాటు హైదరాబాద్‌కు కూడా తీసుకెళ్లి వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఈ నేపథ్యంలో కాలేజీకి కూడా సక్రమంగా వెళ్లలేకపోయింది. చదువులో వెనుక పడతాననే భయం ఒక వైపు, ఆరోగ్యం మెరుగపడలేదనే ఆందోళన మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె బాధను చూడలేక తల్లిదండ్రులు కుంగిపోయారు. ఇవన్నీ గమనించిన ప్రీతి మేఘన ఇక తనువు చాలించడమే మేలనుకుంది. మంగళవారం ఉదయం ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.