గూఢచర్యం గుట్టురట్టు
ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఉద్యోగి అరెస్టు
48 గంటల్లోగా దేశం విడిచివెళ్లాలని ఆదేశం
ఏడాదిన్నరగా ఐఎస్ఐకు సమాచారం చేరవేత
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ గూఢచర్యం గుట్టును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. దేశ రక్షణ శాఖ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న పాక్ హైకమిషన్ ఉద్యోగిని అరెస్టు చేసి భారీ కుట్ర గుట్టు రట్టు చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని జూ పార్కు ప్రాంతంలో పాక్ హైకమిషన్ ఉద్యోగి మెహమూద్ అక్తర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనికి దౌత్య భద్రత ఉండడంతో విదేశాంగ శాఖకు అప్పగించారు. 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాల్సిందిగా అక్తర్‌ను భారత విదేశాంగ శాఖ ఆదేశించింది.
దౌత్య కారణాలతో అక్తర్‌ను విదేశాంగ శాఖకు అప్పగించామని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పాక్ హైకమిషన్‌లోని వీసా విభాగంలో అక్తర్ పనిచేస్తున్నాడని, మరో ఇద్దరి నుంచి కీలక రక్షణ సమాచారం సేకరిస్తుండగా అరెస్టు చేశామని జాయింట్ కమిషనర్ ఆర్ఎస్ యాదవ్ చెప్పారు. ఏడాదిన్నరగా ఈ గూఢచర్యం సాగుతోందని, ఆరు నెలలుగా వారి కార్యకలాపాలపై నిఘా ఉంచామన్నారు. ఈ పరిణామాలతో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్‌కు విదేశాంగ కార్యదర్శి జైశంకర్ సమన్లు జారీచేసి తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. గూఢచర్య కార్యకలాపాలపై అక్తర్‌ను భారత్ నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం... అక్తర్‌ను రాజస్తాన్‌కు చెందిన మౌలానా రంజాన్, సుభాష్ జంగీర్లు జూ వద్ద కలుసుకున్నప్పుడు అరెస్టు చేశారు. మొదట తనను భారతీయుడిగా పేర్కొన్న అక్తర్.. పేరు మహమూద్ రాజ్‌పుత్ అని, చాందినీ చౌక్‌లో ఉంటున్నట్లు బుకాయించాడు. తన పేరుమీదున్న ఆధార్ కార్డును పోలీసులకు చూపాడు. విచారించగా అది నకిలీదని తేలింది. కస్టడీలోకి తీసుకుని విచారించగా హైకమిషన్‌లో పనిచేస్తున్నట్లు అంగీకరించాడు. అక్తర్ ఈ రాకెట్‌కు సూత్రధారని, భారత్‌లో గూఢచారుల నియామకంలో అతనిది కీలక పాత్రని విచారణలో గుర్తించారు. వీసా విభాగంలో పనిచేయడం వల్ల తన కోసం గూఢచారిగా పనిచేసే వారి వివరాలు సేకరించడం అక్తర్‌కు సులభమైంది.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి డబ్బు ఆశచూపడంతో పాటు కొందరికి అమ్మాయిల్ని ఎరవేసి గూఢచర్యానికి పాల్పడ్డట్లు తేలింది. ముగ్గురి నుంచి రక్షణ శాఖ కీలక సమాచార మ్యాపులు, సరిహద్దు ప్రాంతాల మ్యాపులు, వీసా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మౌలానా, జంగీర్ నుంచి మొబైల్స్ స్వాధీనం చేసుకుని అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ఎక్కువగా వాట్సాప్ ద్వారానే మాట్లాడుకునేవారని, ఆ సంభాషణలు రికార్డు కాకపోవడం వారికి కలిసొచ్చిందని పోలీసులు తెలిపారు. కోడ్ పదాలతో సందేశాలు పంపుకునేవారని చెప్పారు. సమాచారం ఇచ్చినందుకు మౌలానా, జంగీర్లకు రూ. 30 -50 వేలు ముట్టేవని అనుమానిస్తున్నారు.
2013లో ఐఎస్ఐలో చేరిన అక్తర్
రెండున్నరేళ్లుగా వీసా విభాగంలో పనిచేస్తున్న అక్తర్... 2013లో డిప్యుటేషన్‌పై ఐఎస్ఐలో చేరాడు. పాక్‌లోని రావల్పిండి జిల్లా కహుటకు చెందిన అతను బలూచ్ రెజిమెంట్‌లో హవల్దార్‌గా చేశాడు. ఢిల్లీ జూ ప్రాంతంలో సుభాష్ జంగీర్, మౌలానా రంజాన్‌ను అక్తర్ అక్టోబర్ 26 ఉదయం 10 గంటల ప్రాంతంలో కలుసుకుంటాడని ముందురోజు పోలీసులు పక్కా సమాచారం అందింది. దీంతో క్రైం బ్రాంచ్ ఏసీపీ సంజయ్ షెరావత్ నేతృత్వంలోని బృందం వలపన్ని వీరిని పట్టుకుంది.
ఆరోపణలు నిరాధారం: పాక్ రాయబారి
అక్తర్‌పై ఆరోపణలు నిరాధారమంటూ పాక్ రాయబారి బాసిత్ తోసిపుచ్చారు. కశ్మీర్‌పై దృష్టి మరల్చేందుకు భారత్ చేసిన ప్రయత్నంగా పాక్ ఆరోపించగా, విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. ఐఎస్ఐ కుట్రను మొగ్గలోనే తుంచేసినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. గూఢచర్యానికి పాల్పడ్డ పాక్ హైకమిషన్ సిబ్బందిని పూర్తిగా విచారించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ప్రతి నెలా కలిసేవారు: పోలీసులు
సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ కార్యకలాపాల రహస్య సమాచారాన్ని వీరిద్దరూ అక్తర్‌కు అందచేసేవారు. ప్రతి నెల ఏదో చోట ముగ్గురూ కలుసుకునేవారు. ముఠాకు చెందిన జోధ్‌పూర్ వాసి షోయబ్‌ను కూడా అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. మౌలానా రాజస్తాన్‌లో ఓ మదర్సాలో పనిచేస్తుండగా, జంగీర్ కిరాణా కొట్టు నిర్వహిస్తున్నాడు. జంగీర్ను మౌలానా గూఢచర్యం వైపు లాగినట్లు వెల్లడైంది. వారిద్దరినీ ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా కోర్టు 12 రోజుల కస్టడీ విధించింది. పత్రాల బహిర్గతంలో బీఎస్ఎఫ్ అధికారుల పాత్రపైనా విచారణ జరుపుతున్నారు.
పాకిస్తాన్ ప్రతీకారం...
ఇస్లామాబాద్: పాక్ దౌత్య ఉద్యోగి దేశ బహిష్కరణతో రగిలిన పాకిస్తాన్ ప్రతీకార చర్యకు పూనుకుంది. ఇస్లామాబాద్‌లోని భారత్ దౌత్య ఉద్యోగి సుర్జీత్ సింగ్‌ను బహిష్కరించింది. 48 గంటల్లోగా పాకిస్తాన్ విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది. భారత హై కమిషనర్ గౌతం బాంబావాలేను గురువారం రాత్రి తన కార్యాలయానికి పిలిపించుకున్న పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి అజీజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.