'48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపో..'
న్యూఢిల్లీ: గూఢచర్యం నిర్వహిస్తున్నాడనే కారణాలతో భారత్లోని పాక్ హైకమిషన్లో పనిచేస్తున్న మొహమ్మద్ అక్తర్ను పోలీసులు అరెస్టు చేయగా అతడిని 48గంటల్లో భారత్ విడిచిపెట్టి వెళ్లాలని భారత విదేశాంగ శాఖ ఆదేశించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం తెలియజేశారు. పాక్ హైకమిషన్ కార్యాలయంలో అక్తర్ వీసా సెక్షన్లో పనిచేస్తున్నాడని, అతడి దౌత్య పరమైన రక్షణ ఉందని వికాస్ స్వరూప్ చెప్పారు.
ఈ కారణంతోనే అరెస్టు చేయడం లేదని అన్నారు. కమిషన్లో పనిచేస్తున్న అతడు గోప్యంగా మరో ఇద్దరు ఉద్యోగుల నుంచి భారత రక్షణ శాఖకు చెందిన కీలక పత్రాలను సేకరిస్తూ గూఢచర్యం నిర్వహిస్తున్నాడని, ఇలాంటి చర్యలకు దిగిన అతడికి ఇక భారత్లో పనిచేసే అవకాశం లేదని, 48గంటల్లో దేశం నుంచి పంపించాలంటూ ఇప్పటికే పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్కు చెప్పినట్లు తెలిపారు.
అక్తర్ను అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించామని, అతడిపై ఏ అధికారి కూడా చేయి చేసుకోలేదని, పాక్ చేసేవి కేవలం ఆరోపణలు మాత్రమే అని అన్నారు. ఇప్పటికే అక్తర్ కు సహాయం చేసిన పాకిస్తాన్ హై కమిషన్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారత రక్షణ శాఖకు సంబంధించిన కీలక పత్రాలను సదరు ఉద్యోగులు దొంగిలించి అక్తర్కు అందించినట్లు తెలుస్తోంది.