తాజ్‌మహల్ ఎదురుగా షాజహాన్ వేసవి బంగ్లా!
ఆగ్రా: మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ చిహ్నం తాజ్‌మహల్ ఎదురుగా మెహ్తాబ్ బాగ్ ఉద్యానవనంలో ఆయనకు ఇష్టమైన వేసవి బంగ్లా కూడా ఉండేదట. భారత పురావస్తు సంస్థ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో శతాబ్దాల నాటి బారాదరి లాంటి మండపం గోడలు, శిథిలాలు ఇటీవల వెలుగుచూశాయి. మెహ్తాబ్(అంటే ఉర్దూలో వెన్నెల) బాగ్‌లోని ఆ మండపంలో రాత్రిపూట సేదతీరుతూ షాజహాన్ తాజ్‌మహల్‌ను చూస్తూ గడుపుతుండేవారని పరిశోధకులు చెబుతున్నారు. భారీ వరదలు లేదా నిర్మాణంలో లోపం కారణంగానే ఈ వేసవి బంగ్లా భూగర్భంలోకి కూరుకుపోయి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. మెహ్తాబ్ బాగ్‌లో తూర్పువైపున 1997-99 మధ్యలో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో కూడా 25 ఫౌంటెయిన్లతో కూడిన ఓ ట్యాంకు, ఓ బారాదరి (అన్ని వైపుల నుంచీ గాలి వీచేలా కట్టిన మండపం) శిథిలాలు వెలుగుచూశాయి.
తాజాగా తాజ్‌మహల్‌కు సూటిగా మెహ్తాబ్ బాగ్‌లో దక్షిణం వైపు జరుపుతున్న తవ్వకాల్లో వేసవి బంగ్లా అవశేషాలు బయటపడ్డాయి. కాగా, ఇప్పుడున్న పాలరాతి తాజ్‌మహల్ ఎదురుగా ఓ నల్లరాతి తాజ్‌మహల్‌ను కూడా నిర్మించాలని, ఆ రెండింటినీ ఓ వారధితో అనుసంధానం చేయాలనీ అప్పట్లో షాజహాన్ భావించారన్న ప్రచారమూ ఉంది. షాజహాన్ నల్లరాతి తాజ్‌మహల్‌ను నిర్మించాలనుకున్నది మెహ్తాబ్ బాగ్లోనేని పలువురు గైడ్లు చెబుతుంటారు కూడా. కానీ బ్లాక్ తాజ్‌మహల్ నిర్మాణ ం గురించి షాజహాన్ ఆలోచించినట్లు ఇప్పటిదాకా ఎలాంటి చారిత్రక ఆధారాలు లభించలేదు.