స్మగ్లర్ల ఆటకట్టించేందుకు.. జూ పార్కు పరిధి పెంపు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు పరిధి పెరగనుంది. పార్కుకు ఉత్తరాన 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మేకలబండ కొండ ప్రాంతాన్ని కూడా పార్కులో విలీనం చేయనున్నారు. ఇందుకోసం అటవీ శాఖ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఎస్వీ జూ పార్కు ప్రస్తుతం 289 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. పార్కుకు దక్షిణాన ఉన్న లక్ష్మీపురం గ్రామం నుంచి కాలిబాటన వెళ్లి మేకలబండ కొండల్లోకి ప్రవేశిస్తోన్న ఎర్రస్మగ్లర్లు, కూలీలు సులువుగా శేషాచలంలోకి చొరబడుతున్నారు. వీరి చొరబాటును అరికట్టాలంటే ఇక్కడున్న మేకలబండ కొండల ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుల పర్యవేక్షణకు అనువుగా మార్చుకోవాలని అధికారులు ఆలోచించి ఈ మేరకు నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం పెరిగిన పరిధిని దృష్టిలో పెట్టుకుని మొత్తం 1200 హెక్టార్ల విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ లే అవుట్ ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అనుమతులు రాగానే మేకలబండ కొండ ప్రాంతంలో పనులు చేపడతామని అటవీ శాఖ చీఫ్ కన్సెర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు పేర్కొన్నారు.