కుమార్తె పెళ్లి కోసం విడుదల చేయండి
టీనగర్: ఇరవై ఆరేళ్ల జైలు జీవితం తనను మార్చివేసిందని, తన కుమార్తె వివాహం జరిపించేందుకు తనను విడుదల చేయాలంటూ నళిని కోర్టును కోరింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితురాలు నళిని 26 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. జైల్లో ఉండగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు మెకరా అని నామకరణం చేశారు. నళిని భర్త మురుగన్ కూడా 26 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. మెకరా బంధువుల సంరక్షణలో ఉంది. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటోంది. మెకరా పెళ్లి ఈడుకు వచ్చినందున ఆమెకు వివాహం చేసేందుకు నళిని ఆశిస్తోంది. 51 ఏళ్ల వయసుగల నళిని శారీరకంగా, మానసికంగా కృంగిపోయారు.
ఆమె న్యాయవాది పుహలేంది తరపున రాతపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. తాను గత 26 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నానని, తన భవిష్యత్తు ఎలావుంటుందో చెప్పలేనన్నారు. 2008 మార్చి నెలలో ఒక మహిళ వేలూరు జైలుకు వచ్చింద ని, ఆమెను తాను సరిగా గుర్తించలేకపోయానని తెలిపారు. తాను ప్రియాంకా అని తెలియజేయడంతో తాను నమ్మలేకపోయానని పేర్కొన్నారు.
ఆ తర్వాత తేరుకున్న తాను తనకేమీ తెలియదమ్మా? అన్నానని, అందుకు ప్రియాంకా తన తండ్రి ఎంతో మంచి వ్యక్తి అని, ఎందుకు ఇలా చేశారు? కారణమేంటి? ఏ సమస్య అయినా చర్చలతో పరిష్కరించుకోవచ్చు కదా! అన్నట్లు తెలిపారు. దీన్ని తాను తట్టుకోలేక బిగ్గరగా రోదించానని, ప్రియాంకతో నాటి కలయిక ఇప్పటికీ మరచిపోలేకున్నట్లు తెలిపారు. తన కుమార్తెను 2005లో చూశానని, ఆ తర్వాత చూడలేదని తెలిపారు. ఆమెను చూసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. ఆమెకు వివాహం చేయాలనుకుంటున్నానని, ఇందుకోసం తనను విడుదల చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. తనను విడుదల చేయాలంటూ నళిని దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది.