ట్రంప్ భార్య నగ్నఫొటోలపై దుమారం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారపర్వంలో ప్రత్యర్థుల ఘాటైన విమర్శలతో పాటు ఊహించని వివాదాలు తెరపైకి వస్తున్నాయి. న్యూయార్క్ పోస్ట్ టాబ్లాయిడ్ రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా నగ్న ఫొటోలను ప్రచురించడం దుమారం రేపింది. 1990ల్లో మెలానియా మోడల్‌గా పనిచేసింది. అప్పటి మెలానియా నగ్న ఫొటోను న్యూయార్క్ పోస్ట్ కవర్ పేజీపై ముద్రించారు. 'అమెరికాకు ప్రథమ మహిళ కావాలనుకుంటున్న ఆమె ఫొటోను ఇలా ఎప్పుడూ చూసుండరు' అని మెలానియా ఫొటో కింద రాసుంది.
1995లో ఓ ఫ్రెంచ్ పురుషుల మేగజైన్ కోసం మెలానియా నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చినట్టు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. కొందరు అరుదుగా చూసిన, ఇతరులు ఎప్పుడూ ప్రచురించని ఫొటోలను తీశారని, వీటిని ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ అలె డి బస్సెవిల్లే తీసినట్టు పేర్కొంది. స్లొవేనియాలో జన్మించిన మెలానియాకు అప్పట్లో 25 ఏళ్ల వయసు ఉంటుంది. మెలానియా ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ ఆనాటి విషయాలను గుర్తుచేసుకుంటూ, నగ్నంగా పొజులివ్వడానికి ఆమె ఎప్పుడూ ఇబ్బందిపడలేదని చెప్పాడు.
ట్రంప్ మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేశారు. 'అత్యంత విజయవంతమైన మోడల్స్‌లో మెలానియా ఒకరు. మేజర్ మేగజైన్స్, కవర్ పేజీల కోసం ఆమె చాలా ఫొటో షూట్స్ చేసింది. మెలానియా ఫొటోలను ఓ యూరోపియన్ మేగజన్ కోసం తీశారు. యూరప్‌లో ఇలాంటి ఫొటోలు చాలా సాధారణం, ఫ్యాషన్' అని చెప్పారు. ట్రంప్ భార్య చిత్రాలను కవర్ పేజీపై ప్రచురించడం తమకు ఎలాంటి సమస్యాలేదని ఆయన సలహాదారు మిల్లర్ అన్నారు. 2005లో ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌లో ట్రంప్ ఆమెను పెళ్లి చేసుకున్నారు.