అమల సభ్యురాలిగా జంతు సంక్షేమ మండలి
చైర్మన్‌గా పశుసంవర్థక శాఖ మంత్రి
సాక్షి, హైదరాబాద్: పశు సంవర్థక శాఖ మంత్రి చైర్మన్‌గా.. సినీనటి, బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ఉత్తర్వులిచ్చారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ మండలిలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, చెన్నైకి చెందిన భారత జంతు సంక్షేమ మండలి చైర్మన్ సహా 13 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. సభ్య కన్వీనర్‌గా పశుసంవర్థక శాఖ డెరైక్టర్ ఉంటారు.
అనధికారిక సభ్యుల్లో అమలతో పాటు స్వామి స్వయం భగవాన్‌దాస్, వైల్డ్‌లైఫ్ ప్రచార మేనేజర్ సి.సంయుక్త, జంతు సంక్షేమ ఉద్యమకారుడు శ్యాంసుందర్ అగర్వాల్, పీలా రామకృష్ణ మెమోరియల్ జీవరక్ష సంఘానికి చెందిన సతీష్ ఖండేవాల్ తదితరులున్నారు. మొత్తం 21 మందితో ఏర్పాటైన మండలి... పీసీఏ చట్టం-1960ను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది.