చంద్రబాబు ద్రోహానికి పాల్పడుతున్నారు...
భూపాలపల్లి : ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటూ తీవ్ర ద్రోహానికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. భూపాలపల్లి పట్టణంలోని దేవి ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదు తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఉండేందుకు చివరి క్షణం వరకు పార్లమెంటు సెంట్రల్హాల్లో ఉండి బాబు చక్రం తిప్పేందుకు యత్నించారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలంగా నిర్ణయం తీసుకోడని భావించే తాను ఆ పార్టీని వీడి కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు వచ్చానన్నారు. స్థానిక టీడీపీ నాయకులు ప్యాకేజీల కోసమే చంద్రబాబు వెంట ఉంటున్నారని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలోని నీళ్లు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, బొగ్గు, విద్య, వైద్యం తదితర రంగాల్లో దోచుకున్నారన్నారు. ఆంధ్రావారి దోపిడిని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మిషన్, ఆసరా ఫించన్లు, సన్నబియ్యం, కళ్యాణలక్ష్మి వంటి బృహత్తరమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. టీఆర్ఎస్ జిల్లా తాజా, మాజీ అధ్యక్షుడు రవీందర్రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తాము ఊహించిన దాని కంటే నాయకులు, కార్యకర్తలు ఎక్కువగానే కష్టపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నా యకులు సిరికొండ ప్రదీప్‌కుమార్, క్రాంతి, భూపాలపల్లి ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, నగర పంచాయతీ కౌన్సిలర్లు శిరుప అనిల్, కంకటి రాజవీరు, నాయకులు మేకల సంపత్‌కుమార్‌యాదవ్, మందల రవీందర్‌రెడ్డి, క్యాతరాజు సాంబమూర్తి, పైడిపెల్లి రమేష్, ముంజాల రవీందర్, నాంపెల్లి రమాదేవి, పున్నం రవి, శ్రీనివాస్‌రెడ్డి, కంభం రవీందర్‌రెడ్డి, గంగాధర్‌రావు పాల్గొన్నారు.