Memorial Day
-
Iran explosions: రక్తమోడిన ర్యాలీ
దుబాయ్: అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 188కి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్‌పై దాడి ఖడ్గం ఝుళిపించింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. బుధవారం మధ్యాహ్నం మూడింటపుడు కెర్మాన్ నగరంలోని ఖాసిమ్ సులేమానీకి నివాళిగా ఆయన సమాధి దగ్గర నాలుగో సంస్మరణ ర్యాలీ జరుగుతుండగా సాహెబ్ అల్–జమాన్ మసీదు సమీపంలో రోడ్డుపై ఈ పేలుడు ఘటన జరిగింది. దారి పొడవునా వేలాది మంది సులేమానీ మద్దతుదారులతో ర్యాలీ కొనసాగుతుండగా సమాధికి 700 మీటర్లదూరంలో మొదటి పేలుడు సంభవించింది. గాయపడిన వారిని కాపాడేందుకు జనం, ఎమర్జెన్సీ విభాగ సభ్యులు భారీ సంఖ్యలో గుమికూడుతుండగా సమాధికి ఒక కిలోమీటర్ దూరంలో మరో భారీ పేలుడు సంభవించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారి ఆర్తనాదాలు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ఘటనాస్థలి భీతావహంగా తయారైంది. ఇది ఉగ్రదాడేనని కెర్మాన్ నగర డెప్యూటీ గవర్నర్ రహ్మాన్ చెప్పారు. అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఎవరీ సులేమానీ? ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లోని కీలక ఖుర్డ్స్ ఫోర్స్‌కు మేజర్ జనరల్ సులేమానీ నేతృత్వం వహిస్తుండేవారు. ఖుర్డ్స్ఫోర్స్ అనేది విదేశీ సైనిక వ్యవహారాల విభాగం. సైన్యం కోసం ఆయుధాలు, నిధుల సేకరణ, నిఘా, సరకుల రవాణా బాధ్యతలను ఈ దళమే చూసుకుంటుంది. ఇరాన్‌కు మద్దతు పలికే గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటెంట్ గ్రూప్‌కు, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌కు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకూ సాయపడుతుంది. దీనిని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గతంలో ప్రకటించింది. ఎందుకు చంపారు? 2020 జనవరిలో ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంక్యూ9 రీపర్ డ్రోన్ సాయంతో అమెరికా సులేమానీని హతమార్చింది. ‘‘ 1998లో ఖుర్డ్స్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇరాక్, సిరియాలో లక్షలాది మంది అమాయకుల మరణాలకు సులేమానీ కారకుడు. ప్రపంచ నంబర్‌వన్ ఉగ్రవాది అయినందుకే అతడిని అంతమొందించాం’ అని నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి రోజున ప్రకటించారు. దీంతో ఆగ్రహంతో ఇరాన్ అప్పట్లో ప్రతీకార దాడులకు దిగడం తెల్సిందే. ఇరాన్ సైన్యాన్ని పటిష్టవంతం చేయడంలో సులేమానీది కీలక పాత్ర. అందుకే ఇరాన్ వ్యాప్తంగా సులేమానీకి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. నేషనల్ ఐకాన్‌గా కీర్తింపబడ్డారు. 2011లో అరబ్ ఉద్యమం తర్వాత సిరియాలో బషర్ అస్సాద్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. కానీ ఈ ఘటనలో సిరియాలో అంతర్యుద్ధం రాజుకుని అది ఇప్పటికీ రగులుతూనే ఉంది. 2018లో ప్రపంచ ఆర్థిక శక్తులు కీలక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగాక ఇరాన్ సైనిక నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ట్రంప్ సర్కార్ ఇచి్చన ఆదేశాలతో సులేమానీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో అప్పట్లో సంచలనమైంది. సులేమానీ హత్యేకాదు అంత్యక్రియల ఘటనా వార్తపత్రికల పతాకశీర్షికలకెక్కింది. 2020లో వేలాదిమంది పాల్గొన్న అంత్యక్రియల్లో తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. -
పేట పోలీసులకు అది కాళరాత్రి..!
చిలకలూరిపేట : విధినిర్వహణలో భాగంగా పోలీసులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకొనేందుకు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పోలీసు శాఖ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దేశరక్షణలో సైనికుల మాదిరి, దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమైనది. పోలీసుల అమరవీరుల స్మరణకు వచ్చినప్పుడల్లా రాష్ట్ర చరిత్రలో సంచలనం కలిగించిన చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి, ఈ సంఘటనలో అమరులైన వారు గుర్తురాకమానరు. అంతా నిమిషాల వ్యవధిలోనే... 2005 మార్చి 11వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో చిలకలూరిపేట పోలీసు స్టేషన్‌పై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. సుమారు 40 మంది మావోయిస్టులు మూడు గ్రూపులుగా ఏర్పడి ఈ విధ్వంసానికి దిగారు. పోలీసు స్టేషన్ చుట్టూ వలయంగా ఏర్పడిన కొంతమంది రాకపోకలను నిలిపివేశారు. మరికొంతమంది పోలీసు స్టేషన్లోకి ప్రవేశించారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ సమయంలో అప్పటి సీఐ ఆర్.ప్రసాద్, ఎస్ఐ ధర్మేంద్రబాబు కలిసి పోలీసు స్టేషన్ పై అంతస్తులో ఓ కేసు విషయంలో విచారణ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు ప్రధాన టార్గెట్‌గా ఉన్న ఎస్ఐ ధర్మేంద్రబాబు కోసం ఈ దాడికి పాల్పడ్డారు. దాడి జరుగుతున్న విషయం పసిగట్టిన సీఐ, ఎస్ఐ ఇద్దరూ కిందికి వచ్చే క్రమంలో మావోయిస్టుల టార్గెట్‌గా ఉన్న ఎస్ఐ ధర్మేంద్రబాబు ప్రహరీ దూకి తప్పించుకున్నారు. పోలీసుస్టేషన్ వెనుక భాగంలో ఉన్న తన క్వార్టర్స్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీఐ ప్రసాద్ మావోయిస్టుల తూటాలకు నేలకొరిగారు. మావోయిస్టులు అత్యాధునిక ఏకే –47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలతో దాడి చేసిన క్రమంలో పోలీసులకు ఎదురుకాల్పులు జరిపే అవకాశం కూడా దక్కలేదు. సీఐతో పాటు హెడ్‌కానిస్టేబుల్ జీఎస్ఆర్ మోహనరావు, కానిస్టేబుల్ ఎస్ ఉమర్, హోంగార్డు ఆర్ వెంకటేశ్వర్లు ఇదే దాడిలో మావోల తూటాలకు బలయ్యారు. సీఐ కోసం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఉన్న ఆయన మిత్రుడు కె.వీరారెడ్డి, పరీక్ష పేపర్ల కోసం వచ్చిన సీఆర్ పాలిటెక్నిక్ కళాశాల అటెండర్ బత్తుల హనుమంతరావు కూడా ఈ కాల్పుల్లో మృతి చెందారు. ఎస్ఐ ధర్మేంద్రబాబు కోసం వెతికే క్రమంలో ఆయన క్వార్టర్స్‌లోకి ప్రవేశించేందుకు సాయుధ నక్సలైట్లు ప్రయత్నించారు. క్వార్టర్ ప్రధాన ద్వారం మూసి ఎస్ఐ తల్లి ఉమామహేశ్వరిదేవి తలుపు వెనుక నిలబడ్డారు. లోనికి ప్రవేశించేందుకు మావోయిస్టులు కాల్పులు జరపటంతో చెక్కతలుపు వెనుక ఉన్న ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. ఈ క్రమంలోనే ఇదే ప్రాంగణంలో ఉన్న రూరల్ పోలీస్‌స్టేషన్ సిబ్బందిని పలువురిని, మావోయిస్టులు తాళ్లతో కట్టివేసి గ్రెనేడ్‌ను జారవిడిచారు. అయితే అదృష్టవశాత్తు అది పేలకపోవటంతో మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఆ రాత్రి చిలకలూరిపేట ప్రజలకు కాళరాత్రిలా ఇప్పటికీ గుర్తుకువస్తూనే ఉంటుంది. నాటి పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా వారి స్పూర్తితో విధులు నిర్వహిస్తామని ప్రతినబూనుతారు. అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తూ రక్తదానం, ఓపెన్‌హౌస్, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్ పోటీలు ప్రతిఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. -
స్నేహహస్తం అందివ్వాలి
కర్నూలు: శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు స్నేహ హస్తం అందివ్వాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ కోరారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పెరేడ్ మైదానంలో అమరవీరుల స్మృతి స్థూపానికి కలెక్టర్‌తో పాటు జిల్లా జడ్జి వెంకట జ్యోతిర్మయి, డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ ఆకె రవికృష్ణ, అడిషనల్ ఎస్పీ బాబూరావు, ఓఎస్డీ మనోహర్‌రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎ.జి.కృష్ణమూర్తి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఏఆర్ డీఎస్పీ అశోక్‌బాబు, హోంగార్డు డీఎస్పీ కృష్ణమోహన్, నగరంలోని సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు నివాళులర్పించారు. పోలీసు అమర వీరుల కుటంబాలకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే శత్రువులను తిప్పికొట్టగలమన్నారు. తుపాకీ ఎలాంటిదని కాదు.. మనిషి ఎంత సమర్థుడనేది ముఖ్యమన్నారు. అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందాల్సిన సదుపాయాలను చట్ట ప్రకారం సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ తరఫున ముఖ్య పట్టణాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్, కార్టూన్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశామన్నారు. పోలీసులు ఉపయోగిస్తున్న ఆయుధాలపై ప్రదర్శన శాలలను ఏర్పాటు చేసి విద్యార్థులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. మైత్రి సంఘాలతో పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో పల్లెనిద్ర కార్యక్రమంలో ద్వారా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నామన్నారు. అనంతరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 642 మంది పేర్లను ఏఎస్పీ బాబురావు చదివి వినిపించారు. కార్యక్రమంలో పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌నాయక్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనంతసేన, కార్యవర్గ సభ్యులు శేఖర్‌బాబు, ఈరన్న, పోలీసు హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రఘురాముడు తదితరులు పాల్గొన్నారు.