స్నేహహస్తం అందివ్వాలి
కర్నూలు:
శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు స్నేహ హస్తం అందివ్వాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ కోరారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పెరేడ్ మైదానంలో అమరవీరుల స్మృతి స్థూపానికి కలెక్టర్‌తో పాటు జిల్లా జడ్జి వెంకట జ్యోతిర్మయి, డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ ఆకె రవికృష్ణ, అడిషనల్ ఎస్పీ బాబూరావు, ఓఎస్‌డీ మనోహర్‌రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎ.జి.కృష్ణమూర్తి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఏఆర్ డీఎస్పీ అశోక్‌బాబు, హోంగార్డు డీఎస్పీ కృష్ణమోహన్, నగరంలోని సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు నివాళులర్పించారు.
పోలీసు అమర వీరుల కుటంబాలకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే శత్రువులను తిప్పికొట్టగలమన్నారు. తుపాకీ ఎలాంటిదని కాదు.. మనిషి ఎంత సమర్థుడనేది ముఖ్యమన్నారు. అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందాల్సిన సదుపాయాలను చట్ట ప్రకారం సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ తరఫున ముఖ్య పట్టణాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.
పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్, కార్టూన్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశామన్నారు. పోలీసులు ఉపయోగిస్తున్న ఆయుధాలపై ప్రదర్శన శాలలను ఏర్పాటు చేసి విద్యార్థులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. మైత్రి సంఘాలతో పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో పల్లెనిద్ర కార్యక్రమంలో ద్వారా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నామన్నారు.
అనంతరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 642 మంది పేర్లను ఏఎస్పీ బాబురావు చదివి వినిపించారు. కార్యక్రమంలో పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌నాయక్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనంతసేన, కార్యవర్గ సభ్యులు శేఖర్‌బాబు, ఈరన్న, పోలీసు హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రఘురాముడు తదితరులు పాల్గొన్నారు.