పల్స్‌పోలియోను విజయవంతం చేయండి | Palspoliyonu to succeed | Sakshi
Sakshi News home page

పల్స్‌పోలియోను విజయవంతం చేయండి

Published Tue, Jan 13 2015 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

పల్స్‌పోలియోను విజయవంతం చేయండి

పల్స్‌పోలియోను విజయవంతం చేయండి

కర్నూలు(అగ్రికల్చర్): పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆదేశించారు. సోమవారం ఉదయం కాన్ఫరెన్స్ హాల్‌లో పల్స్‌పోలియో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో రహిత జిల్లాగా కర్నూలు గుర్తింపు పొందిందన్నారు. ఇకపై కూడా పోలియో మహమ్మారి దరి చేరకుండా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు.

ఐదేళ్ల లోపు పిల్లలు 5.07 లక్షల మందిని గుర్తించామని, వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 2,167, అర్బన్ ప్రాంతాల్లో 473 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఇతర ప్రధాన కూడళ్లలోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణంలోని చిన్నారులను గుర్తించి చుక్కలు వేయించాలన్నారు. మురికి వాడలు, చెంచుగూడేలు, గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.

18న పల్స్‌పోలియో కార్యక్రమం ఉంటుందని, 17వ తేదీన ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు. 19, 20వ తేదీల్లో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయించుకోని వారిని గుర్తించి చుక్కలు వేయాలన్నారు. పల్స్‌పోలియో సందర్భంగా 18న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.

స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి నోడల్ అధికారి తమ మండలంలో ఎంపిక చేసుకున్న గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా డంపింగ్ యార్డులకు తరలించే ప్రక్రియను చేపట్టాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపైనా చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన పింఛన్ల పంపిణీని సమీక్షించారు. ఏజేసీ రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ నిరుపమ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement