ch vijayamohan
-
దేశ తలరాతను మార్చేది యువతే
కర్నూలు జిల్లా పరిషత్ : దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం.. ఒక దేశం తలరాత మార్చేది వారే.. విద్యావంతులందరూ ఓటు వేస్తేనే మంచి నాయకుడ్ని ఎన్నుకునే అవకాశం వస్తుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సీహెచ్ విజయమోహన్ అన్నారు. కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆదివారం ఏర్పాటు చేసిన జాతీయ ఓటరు దినోత్సవ వేదికపై ఆయన మాట్లాడారు. తైవాన్, సింగపూర్, మలేషియా, జపాన్ దేశాలు మనకన్నా చాలా చిన్నవని, కానీ అభివృద్ధిలో అవి ప్రపంచ ఆర్థిక స్థాయిని శాసిస్తున్నాయని చెప్పారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్నట్లే మన దేశంలోనూ వనరులు ఉన్నాయన్నారు. కానీ అక్కడి ప్రజల ఆలోచన తీరు వేరని, అందుకే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. భిక్షమెత్తుకునే స్థాయి నుంచి దక్షిణకొరియా నేడు డొనేషన్లు ఇచ్చే స్థాయికి చేరిందన్నారు. అక్కడి తలసరి ఆదాయం రూ.22 లక్షలుగా ఉంటే మన దేశ తలసరి ఆదాయం రూ.75 వేలేనన్నారు. మన దేశంలో ఈ పరిస్థితి మారాలంటే ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలన్నారు. డబ్బు తీసుకుని ఓటేసే దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదని చెప్పారు. ఐదేళ్లు పాలకులను శాసించగలిగే స్థాయిలో ఓటర్లు ఉన్నారని తెలిపారు. పేదలు, మురికివాడల్లోని ప్రజలతో పాటు విద్యావంతులూ ఓటు హక్కు వినియోగించుకుంటే మంచి నాయకులు వస్తార ని డీఐజి రమణకుమార్ అన్నారు. పేదలు, మురికివాడల్లో 70 శాతం, విద్యావంతులుండే ప్రాంతాల్లో 30 శాతం ఓటింగ్ జరుగుతోందని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. ధన, కుల ప్రభావం ఓటర్లను ప్రలోభపెట్టే వ్యవస్థలో ఉన్నామన్నారు. ఓటు ప్రాథమిక హక్కుతో పాటు ప్రాథమిక బాధ్యత కూడానన్నారు. 18 ఏళ్ల దాటిన బాలుర కంటే బాలికలే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు. ఓటు హక్కు ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని ఎస్పీ రవికృష్ణ అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని ఆయన యువతను కోరారు. ఎన్నికల రోజు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా మన భవిష్యత్‌ను మార్చే ఓటును సద్వినియోగం చేసుకోవాలని ూట్లాడుతూ సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలాల్లోని పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన 30 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరితో పాటు ప్రశంసాపత్రాన్ని, 2కె రన్లో విజేతలైన 8 మంది విద్యార్థులకు నగదు బహుమతులు, జిల్లాలో ఐదుసార్లు ఎన్నికల్లో వరుసగా ఓటు వేసిన ఆరుగురు సీనియర్ సిటిజన్లకు కలెక్టర్, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ట్రైనీ కలెక్టర్ లక్ష్మీషా, రాయలసీమ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ చక్రవర్తి, డీఆర్ఓ జి.గంగాధర్‌గౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ మూర్తి, డీఈఓ సుప్రకాశ్, డీఎస్పీ రమణమూర్తి, కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, టీడీపీ నాయకుడు సతీశ్చౌదరి, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
కర్నూలు(అగ్రికల్చర్): పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆదేశించారు. సోమవారం ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో పల్స్‌పోలియో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో రహిత జిల్లాగా కర్నూలు గుర్తింపు పొందిందన్నారు. ఇకపై కూడా పోలియో మహమ్మారి దరి చేరకుండా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు 5.07 లక్షల మందిని గుర్తించామని, వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 2,167, అర్బన్ ప్రాంతాల్లో 473 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఇతర ప్రధాన కూడళ్లలోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణంలోని చిన్నారులను గుర్తించి చుక్కలు వేయించాలన్నారు. మురికి వాడలు, చెంచుగూడేలు, గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. 18న పల్స్‌పోలియో కార్యక్రమం ఉంటుందని, 17వ తేదీన ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు. 19, 20వ తేదీల్లో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయించుకోని వారిని గుర్తించి చుక్కలు వేయాలన్నారు. పల్స్‌పోలియో సందర్భంగా 18న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి నోడల్ అధికారి తమ మండలంలో ఎంపిక చేసుకున్న గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా డంపింగ్ యార్డులకు తరలించే ప్రక్రియను చేపట్టాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపైనా చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన పింఛన్ల పంపిణీని సమీక్షించారు. ఏజేసీ రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడు, డీఎంహెచ్ఓ డాక్టర్ నిరుపమ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(అగ్రికల్చర్): శ్రీశైలంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి నిర్వహించే బ్రహ్మోత్సవాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలనికలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా శ్రీశైలంలో చేపట్టే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. దక్షణ భారతదేశంలోనే శ్రీశైలం ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం అయినందున ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేశం నలుమూలల నుంచి లక్షల మంది శివభక్తులు వస్తున్నందున ఎవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 2వ తేదీన అంకురార్పణ, ధ్వజారోహణలతో శ్రీకారం చుడతామని, 17వ తేదీన శివరాత్రి రోజు రాత్రి కళ్యాణోత్సవం, 18వ తేదీ రథోత్సవం ఉంటాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 14వ తేదీ రాత్రి 7:30 నుంచి 19వ తేదీ వరకు సర్వదర్శనం నిలుపుదల చేస్తున్నట్లుగా వివరించారు. ఈనెల 21వ తేదీన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శ్రీశైలంలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. అదనపు ఎస్పీ శివకోటి బాబురావు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు నిమిత్తం 3 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నామని తెలిపారు. -
సాగు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ విజయమోహన్ కోసిగి రూరల్: జిల్లా పరిధిలోని అన్ని రకాల ప్రాజెక్టుల నుంచి ప్రజలకు, రైతులకు తాగు, సాగునీటిని సక్రమంగా సరఫరా చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. కోసిగి మండలం అగసనూరు సమీపంలో నిర్మించిన అగసనూరు ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో 700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ. 4.54 కోట్ల నిధులతో ఈ పథక నిర్మాణం చేపట్టిందన్నారు. నిర్మాణం పూర్తి కావడంతో నవంబర్ 1న ట్రయల్ రన్ చేపట్టి అదే నెల 10 లేదా 11 తేదీల్లో రైతులకు సాగు నీరు అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లక్ష ఎకరాలకు సాగునీరు : జిల్లా వ్యాప్తంగా 22 ఎత్తి పోతల పథకాల నిర్మాణాలు వివిద దశల్లో ఉన్నాయని కలెక్టర్ విజయ మోహన్ వెల్లడించారు. వాటి ద్వారా సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా కావాల్సి ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎత్తి పోతల పథకాలన్నింటిని వీలైనంత త్వరలో పూర్తి చేయించి ఖరీఫ్, రభీ సీజన్లలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట డీపీఆర్ఓ సుకుమార్, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్టుమెంట్ కార్పొరేషన్ ఈఈ రెడ్డి శంకర్, డీఈ సుకుమార్, ఏఈ మధూకర్, ఆదోని ఆర్డీఓ వెంకటకృష్ణుడు, కోసిగి, మంత్రాలయం తహశీల్దారులు ఉమామహేశ్వరి, శ్రీనివాసరావు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకాశ్‌రెడ్డి, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షుడు హనుమప్ప, ఈరన్న, రాముడు తదితరులున్నారు. -
స్నేహహస్తం అందివ్వాలి
కర్నూలు: శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు స్నేహ హస్తం అందివ్వాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ కోరారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పెరేడ్ మైదానంలో అమరవీరుల స్మృతి స్థూపానికి కలెక్టర్‌తో పాటు జిల్లా జడ్జి వెంకట జ్యోతిర్మయి, డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ ఆకె రవికృష్ణ, అడిషనల్ ఎస్పీ బాబూరావు, ఓఎస్డీ మనోహర్‌రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎ.జి.కృష్ణమూర్తి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఏఆర్ డీఎస్పీ అశోక్‌బాబు, హోంగార్డు డీఎస్పీ కృష్ణమోహన్, నగరంలోని సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు నివాళులర్పించారు. పోలీసు అమర వీరుల కుటంబాలకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే శత్రువులను తిప్పికొట్టగలమన్నారు. తుపాకీ ఎలాంటిదని కాదు.. మనిషి ఎంత సమర్థుడనేది ముఖ్యమన్నారు. అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందాల్సిన సదుపాయాలను చట్ట ప్రకారం సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ తరఫున ముఖ్య పట్టణాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్, కార్టూన్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశామన్నారు. పోలీసులు ఉపయోగిస్తున్న ఆయుధాలపై ప్రదర్శన శాలలను ఏర్పాటు చేసి విద్యార్థులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. మైత్రి సంఘాలతో పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో పల్లెనిద్ర కార్యక్రమంలో ద్వారా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నామన్నారు. అనంతరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 642 మంది పేర్లను ఏఎస్పీ బాబురావు చదివి వినిపించారు. కార్యక్రమంలో పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌నాయక్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనంతసేన, కార్యవర్గ సభ్యులు శేఖర్‌బాబు, ఈరన్న, పోలీసు హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రఘురాముడు తదితరులు పాల్గొన్నారు. -
మున్సి‘పోల్స్’కు 2,695 మంది సిబ్బంది
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఒక కార్పొరేషన్, 8 మునిసిపాలీటీల పరిధిలో ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు 2,695 మంది పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసినట్టు జిల్లా ఎన్నికల పరిశీలకులు సీహెచ్ విజయమోహన్ చెప్పారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసే ప్రక్రియను మంగళవారం స్థానిక నిక్నెట్ సెంటర్లో కంప్యూటర్ ద్వారా ఆయన పరిశీలించారు. జిల్లాలో 539 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో పీవో, ఏపీవో, వోపీవో, ఇతర పోలింగ్ సిబ్బందిని పారదర్శకంగా నియమించినట్లు తెలిపారు. మునిసిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విజయమోహన్ చెప్పారు. పోలింగ్ విధులకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందేనని, ఈ విషయంలో ఏ ఒక్కరికీ మినహాయింపు లేదని ఆయన స్పష్టం చేశారు. 270 మందిని ముందస్తుగా రిజర్వ్‌లో ఉంచినట్టు ఆయన చెప్పారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ సిబ్బంది వివరాలను విజయ్‌మోహన్ కలెక్టర్ సిద్ధార్థ జైన్‌కు వివరించారు. డీఆర్వో కె.ప్రభాకరరావు, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, ఎన్ఐసీ సైంటిస్టులు గంగాధర్, జీవీఎుస్ఎస్ శర్మ పాల్గొన్నారు.