ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఒక కార్పొరేషన్, 8 మునిసిపాలీటీల పరిధిలో ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు 2,695 మంది పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసినట్టు జిల్లా ఎన్నికల పరిశీలకులు సీహెచ్ విజయమోహన్ చెప్పారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసే ప్రక్రియను మంగళవారం స్థానిక నిక్‌నెట్ సెంటర్‌లో కంప్యూటర్ ద్వారా ఆయన పరిశీలించారు.
జిల్లాలో 539 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో పీవో, ఏపీవో, వోపీవో, ఇతర పోలింగ్ సిబ్బందిని పారదర్శకంగా నియమించినట్లు తెలిపారు. మునిసిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విజయమోహన్ చెప్పారు. పోలింగ్ విధులకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందేనని, ఈ విషయంలో ఏ ఒక్కరికీ మినహాయింపు లేదని ఆయన స్పష్టం చేశారు. 270 మందిని ముందస్తుగా రిజర్వ్‌లో ఉంచినట్టు ఆయన చెప్పారు.
ర్యాండమైజేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ సిబ్బంది వివరాలను విజయ్‌మోహన్ కలెక్టర్ సిద్ధార్థ జైన్‌కు వివరించారు. డీఆర్‌వో కె.ప్రభాకరరావు, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, ఎన్‌ఐసీ సైంటిస్టులు గంగాధర్, జీవీఎుస్‌ఎస్ శర్మ పాల్గొన్నారు.