పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఏలూరు, న్యూస్‌లైన్:జిల్లాలో బుధవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిద్ధార్థజైన్ చెప్పారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రలోభాల అంశం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని, దీంతో ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి మరో అదనపు వ్యయ పరిశీలనిగా దేవదాసన్‌ను నియమించారని తెలిపారు. గత రెండు రోజుల్లో జిల్లాలో రూ. 3.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం సుమారు రూ. 5.46కోట్లకు చేరిందని వివరించారు. ఈ వ్యవహారాలపై పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో వివిధ బృందాలు జరిపిన దాడుల్లో భారీగా మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ. 2 లక్షల విలువైన చీరలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఓటరు ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ప్రలోభాల వలలో పడకుండా విజ్ఞతతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనువైన పరిస్థితులను సృష్టించేందుకు జిల్లా యంత్రాంగం తీవ్ర స్థాయిలోనే కసరత్తు చేసిందన్నారు. పోలింగ్ ముగిసేంత వరకు ఈ కసరత్తు కొనసాగుతుందని చెప్పారు. నిఘా బృందాలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.
మీడియా ప్రతినిధులూ సమాచారం అందించండి
ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధులు కూడా తగిన సమాచారాన్ని అధికారులకు అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల లోపు ఎన్నికల సంఘం నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని తెలిపారు. వాహనాలను నిబంధనలు పాటిస్తూ వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేసిన వారిని అది ఎవరికి వేశారని, ఎవరూ అడగకూడదని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ ముగిసేవరకూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించటాన్ని ఎన్నికల సంఘం నిషేధించిందని తెలి పారు. ఏ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలోనైనా సాంకేతిక సమస్య తలెత్తి పోలింగ్ నిలిచి పోతే మీడియా ప్రతినిధులు అధికారులకు కూడా సమాచారం అందిస్తే ఆ సమస్యను తక్షణం పరిష్కరించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ సాంకేతిక సమస్య తలెత్తినా 20 నుంచి 25 నిమిషాలలోపు దానిని పరిష్కరిం చేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.
2,249 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ : జేసీ
జిల్లాలోని 2వేల 249 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను నిరంతరం చిత్రీకరించటానికి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు జేసీ టి.బాబూరావునాయుడు వెల్లడించారు. వెబ్ కెమెరాల ఏర్పాట్లపై ఆయన అధికారులతో కలెక్టరేట్‌లో చర్చించారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ తీరును ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి వెబ్ ఈ చిత్రీకరణ దోహదపడుతుందని చెప్పారు. వెబ్‌కాస్టింగ్ కోసం ఖమ్మం జిల్లా నుంచి 150 మంది, నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన 550 మంది, ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 1,183 మంది విద్యార్థినీ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లతోపాటు మీ సేవ కేంద్రాలకు చెందిన 300 మందిని వినియోగించుకుంటున్నట్టు వివరించారు. మారుమూల పల్లెల్లో జరిగే పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా చూసేందుకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. మీ సేవ కేంద్రాలకు చెందిన సిబ్బంది బాధ్యతాయుతంగా, సక్రమంగా విధులు నిర్వర్తించాలని, వెబ్ కాస్టింగ్‌లో చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా అన్ని ఏర్పాట్లు మంగళవారం రాత్రికి పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎన్‌ఐసీ సైంటిస్ట్ శర్మ, కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో 29.10 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పోలింగు సామగ్రి పంపిణీ కేంద్రంలో సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు. పోలింగు ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరగకుండా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని, పోలింగ్ వేగవంతంగా నిర్వహించడానికి ప్రత్యేక చొరవచూపాలని కోరారు. జిల్లాలో 3,055 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అసౌకర్యం కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించామని, బారులుతీరిన ఓటర్లు నిలబడాల్సిన పరిస్ధితి ఉత్పన్నమవుతుందన్న దృష్టితో షామియానాలను సిద్ధం చేశామని కలెక్టర్ చెప్పారు.
ఓటర్లను తరలించే వాహనాలు సీజ్ చేస్తాం..
ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఆటోలు, లారీలను కొందరు అభ్యర్థులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందిందని కలెక్టర్ చెప్పారు. ఇటువంటి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా చేరవేసే వారిని అరెస్ట్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న ఇద్దర్ని అరెస్టు చేశామన్నారు. ఓటర్లకు పంపిణీ చేయటానికి మొగల్తూరులో సిద్ధం చేసిన రూ.86,600 విలువైన 570 స్టీలు బిందెలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పెనుగొండలో రూ.92వేల నగదును సీజ్ చేసినట్టు చెప్పారు.