సిల్లీ ‘బాబు’
- ప్రచారంలో మాగంటి తీరుతో బేజారెత్తుతున్న నాయకులు, కార్యకర్తలు
- బూతు జోకులు, కుళ్లు
- డైలాగులతో కాలక్షేపం
- పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పేరుగొప్ప.. ఊరు దిబ్బ.. అనే సామెత మాగంటి బాబుకు అతికినట్లు సరిపోతుంది. జిల్లాలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన మాగంటి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆ స్థాయి రాజకీయాలను కొనసాగించలేక చతి కిలపడుతున్నారు. ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి ప్రచారంలో ఏమాత్రం ప్రభావం చూపులేకపోతున్నారని తెలుగు తమ్ముళ్లు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.
సీటు రాకముందు వరకూ హడావుడి చేసిన ఆయన సీటు దక్కించుకున్నాక ప్రత్యర్థులతో పోటీ పడలేకపోతున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు. ప్రచారంలో కూడా బాగా వెనుకబడిన బాబు ఎక్కడకు వెళ్లినా కార్యకర్తల్లో ఉత్సాహం నింపకపోగా బూతు జోకులు, కుళ్లు డైలాగులు వేస్తూ వెగటు పుట్టిస్తున్నారనే ప్రచారం టీడీపీలో బాగా జరుగుతోంది.
తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, తల్లి మాగంటి వరలక్ష్మి వారసత్వాన్ని అందుకుని వారి రాజకీయ వారసుడిగా ముందుకొచ్చిన బాబుకు మొదట్లో జనంలో కొంత ఆదరణ ఉండేది. అయితే ఆయన తీరుగా హుం దాగా లేకపోవడం, రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో జనంలో పలుచబడుతూ వచ్చారు.నాలుగుసార్లు ఎంపీగా పోటీచేసి కేవలం ఒకసారి మాత్రమే గెలిచారు. దెందులూరు నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి నిర్వహించి కూడా రాజకీయంగా ఫెయిలయ్యారనే వాదన ఉంది.
ఈ క్రమంలోనే 2009 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆయన పనితీరు సరిగా లేదని గ్రహించి మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో బాబు టీడీపీ పంచన చేరారు. ఆ తర్వాత కూడా ఆయన రాజకీయ వ్యూహాలు తల్లకిందులవుతూనే ఉన్నాయి.
ఎన్నికల్లో ప్రభావం శూన్యం
ఈ ఎన్నికల్లో అయినా ఆయన కొంత ప్రభావం చూపిస్తారని తెలుగుదేశం పార్టీ క్యాడర్ భావించినా ఆయన మాత్రం తన పాత పంథాలోనే వెళుతున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నీరుగారిపోతున్నారు.
కీలకమైన ఈ తరుణంలోనూ మాగంటి బాబు కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారితో పనిచేయించుకోవడమే తప్ప వారి యోగక్షేమాలు పట్టించుకోకపోవడంతో అందరిలోనూ ఎన్నికల్లో పనిచేస్తున్నామన్న ఉత్సాహమే లేకుండాపోయిందని కొందరు నేతలు వాపోతున్నారు.
జనంలోనూ సీన్ లేదు
ఇక జనంలోనూ మాగంటి బాబుపై సరైన అభిప్రాయం లేకుండాపోయింది. సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా ఆయన తమ ప్రాంతానికి ఏమీ చేయలేదని ఆయన సొంత నియోజకవర్గమైన దెందులూరులోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎంపీగా కొద్దిరోజులు పనిచేసినా పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారు.
2004లో దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అధికారంలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయారు. తొలినుంచీ కొల్లేరు ప్రజలు ఆయన్ను ఆదరిస్తున్నా వారి గురించి ఆలోచించిన పాపానపోలేదు. కొల్లేరు ప్రజలు ఇబ్బంది పడింది కూడా ఆయన పదవిలో ఉన్న సమయంలోనే.తన ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా అప్పట్లో పెదవి విప్పలేదు. చివరకు కొల్లేరు ప్రజలకు మాత్రం ఏమీ ఒరగబెట్టలేకపోయారు.మొత్తంగా అటు ప్రజలకు ఇటు కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయిన బాబు ఇప్పుడు మళ్లీ ఎన్నికల బరిలోకి దిగారు.
ప్రతిచోటా కుళ్లు జోకులు వేస్తూ ‘సిల్లీ ఫెలో’ అనిపించుకుంటున్న ఆయన తీరుపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో కలసి ప్రచారానికి వెళ్లటం వల్ల తమ వ్యక్తిగత ఇమేజ్ కూడా దెబ్బతింటోందని నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.