district election observers
-
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించొద్దు
కోదాడఅర్బన్, న్యూస్‌లైన్,విధి నిర్వహణలో ఎన్నికల సిబ్బంది అలసత్వాన్ని ప్రదర్శించొద్దని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు శారదదేవి, జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ సూచించారు. కోదాడ పట్టణ పరిధిలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శనివారం వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పలు అంశాలపై వారు సూచనలిచ్చారు. సమస్యలు ఏమైనా తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఎన్నికల అధికారి రామానుజుల రెడ్డి వారికి వివరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో ఎలాంటి లోపాలు జరగకుండా సజావుగా నిర్వహిం చేందుకు సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలలో జరిగే పోలింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా కలెక్టరేట్లో అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. వారి వెంట సూర్యాపేట ఆర్డీవో నాగన్న ఉన్నారు. ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలింపు ఎన్నికల విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది శనివారం మధ్యాహ్నం తమకు కేటాయించిన వార్డులకు ఈవీఎంలను తీసుకవెళ్లారు. మొత్తం 30 వార్డులను ఆరు జోన్లుగా విభజించిన అధికారులు పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులలో ఆయా పోలింగ్ కేంద్రాల సిబ్బంది తమ వెంట పోలింగ్ సామగ్రిని తీసుకెళ్లారు. -
మున్సి‘పోల్స్’కు 2,695 మంది సిబ్బంది
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఒక కార్పొరేషన్, 8 మునిసిపాలీటీల పరిధిలో ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు 2,695 మంది పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసినట్టు జిల్లా ఎన్నికల పరిశీలకులు సీహెచ్ విజయమోహన్ చెప్పారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసే ప్రక్రియను మంగళవారం స్థానిక నిక్నెట్ సెంటర్లో కంప్యూటర్ ద్వారా ఆయన పరిశీలించారు. జిల్లాలో 539 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో పీవో, ఏపీవో, వోపీవో, ఇతర పోలింగ్ సిబ్బందిని పారదర్శకంగా నియమించినట్లు తెలిపారు. మునిసిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విజయమోహన్ చెప్పారు. పోలింగ్ విధులకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందేనని, ఈ విషయంలో ఏ ఒక్కరికీ మినహాయింపు లేదని ఆయన స్పష్టం చేశారు. 270 మందిని ముందస్తుగా రిజర్వ్‌లో ఉంచినట్టు ఆయన చెప్పారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ సిబ్బంది వివరాలను విజయ్‌మోహన్ కలెక్టర్ సిద్ధార్థ జైన్‌కు వివరించారు. డీఆర్వో కె.ప్రభాకరరావు, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, ఎన్ఐసీ సైంటిస్టులు గంగాధర్, జీవీఎుస్ఎస్ శర్మ పాల్గొన్నారు.