సాగు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ విజయమోహన్
కోసిగి రూరల్:
జిల్లా పరిధిలోని అన్ని రకాల ప్రాజెక్టుల నుంచి ప్రజలకు, రైతులకు తాగు, సాగునీటిని సక్రమంగా సరఫరా చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. కోసిగి మండలం అగసనూరు సమీపంలో నిర్మించిన అగసనూరు ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో 700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ. 4.54 కోట్ల నిధులతో ఈ పథక నిర్మాణం చేపట్టిందన్నారు. నిర్మాణం పూర్తి కావడంతో నవంబర్ 1న ట్రయల్ రన్ చేపట్టి అదే నెల 10 లేదా 11 తేదీల్లో రైతులకు సాగు నీరు అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
లక్ష ఎకరాలకు సాగునీరు :
జిల్లా వ్యాప్తంగా 22 ఎత్తి పోతల పథకాల నిర్మాణాలు వివిద దశల్లో ఉన్నాయని కలెక్టర్ విజయ మోహన్ వెల్లడించారు. వాటి ద్వారా సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా కావాల్సి ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎత్తి పోతల పథకాలన్నింటిని వీలైనంత త్వరలో పూర్తి చేయించి ఖరీఫ్, రభీ సీజన్‌లలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు.
కలెక్టర్ వెంట డీపీఆర్‌ఓ సుకుమార్, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్టుమెంట్ కార్పొరేషన్ ఈఈ రెడ్డి శంకర్, డీఈ సుకుమార్, ఏఈ మధూకర్, ఆదోని ఆర్డీఓ వెంకటకృష్ణుడు, కోసిగి, మంత్రాలయం తహశీల్దారులు ఉమామహేశ్వరి, శ్రీనివాసరావు, స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఆకాశ్‌రెడ్డి, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షుడు హనుమప్ప, ఈరన్న, రాముడు తదితరులున్నారు.