బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(అగ్రికల్చర్): శ్రీశైలంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి నిర్వహించే బ్రహ్మోత్సవాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలనికలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా శ్రీశైలంలో చేపట్టే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. దక్షణ భారతదేశంలోనే శ్రీశైలం ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం అయినందున ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
దేశం నలుమూలల నుంచి లక్షల మంది శివభక్తులు వస్తున్నందున ఎవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 2వ తేదీన అంకురార్పణ, ధ్వజారోహణలతో శ్రీకారం చుడతామని, 17వ తేదీన శివరాత్రి రోజు రాత్రి కళ్యాణోత్సవం, 18వ తేదీ రథోత్సవం ఉంటాయని తెలిపారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 14వ తేదీ రాత్రి 7:30 నుంచి 19వ తేదీ వరకు సర్వదర్శనం నిలుపుదల చేస్తున్నట్లుగా వివరించారు. ఈనెల 21వ తేదీన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శ్రీశైలంలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. అదనపు ఎస్పీ శివకోటి బాబురావు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు నిమిత్తం 3 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నామని తెలిపారు.