బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ | brahmotsavas starts from today | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

Published Thu, Feb 16 2017 9:58 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ - Sakshi

బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

 -  ఫిబ్రవరి 27వరకు శ్రీశైలంలో
   శివరాత్రి బ్రహ్మోత్సవాలు
-ఉదయం 8.30గంటలకు యాగశాల ప్రవేశం
- సాయంత్రం 7గంటలకు
   ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ
- ఆర్జిత అభిషేకాది అర్చనలు, హోమాలు రద్దు 
 
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో స్వయంభూవుగా వెలిసిన భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం యాగశాల ప్రవేశంతో అంకురార్పణ జరగనుంది. ఉదయం 8.30 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనము, శివసంకల్పం, చండీశ్వర పూజ, ఋత్విగ్వరణము కార్యక్రమాలుంటాయి. ఆ తరువాత అఖండస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్ర కలశ స్థాపన పూజలను నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రి 7 గంటలకు త్రిశూల పూజ, భేరీపూజ, సకల దేవతాహ్వాన పూర్వక ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, బలిహరణలు జరుగుతాయి. 18 నుంచి 26 వరకు రోజూ ఉదయం 7.30గంటల నుంచి చండీశ్వరపూజ, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు చేస్తారు. ఉత్సవాలు ముగిసే వరకు రోజూ ఉదయం 9గంటలకు రుద్రహోమం, చండీహోమాలను నిర్వహిస్తారు. 10.30గంటలకు నిత్యబలిహరణలు, సాయంత్రం 6గంటల నుంచి నిత్యపూజలు, అనుష్ఠానములు, నిత్యహవనములు, బలిహరణలుంటాయి. 
 
18న టీటీడీ, 21న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ 
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంప్రదాయానుసారం ఈ నెల 18న తిరుమల తిరుపతి దేవస్థానం, 21న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పిస్తారు. దీనికి ముందుగా ప్రధానాలయ రాజగోపురం వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలను చేసి, వివిధ రకాలైన ఫలపుష్పాదులను సమర్పించి ఆలయప్రదక్షిణ చేసిన తరువాత పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 
 
24న మహాశివరాత్రి– బ్రహ్మోత్సవ కల్యాణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లకు సాయంత్రం 7గంటల నుంచి నందివాహనసేవ, ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. రాత్రి 10.30గంటల నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 10.30గంటల నుంచి పాగాలంకరణ, రాత్రి 12 గంటల తరువాత శాస్త్రోక్తంగా భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణాన్ని నిర్వహించడానికి ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక వేదికను తయారు చేస్తునట్లు ఈఓ నారాయణ భరత్‌ గుప్త తెలిపారు. 
 
25న రథోత్సవం
మహాశివరాత్రి పర్వదినాన వధూవరులైన భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను 25న అంగరంగ వైభవంగా రథంపై ఆవహింపజేసి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతకుముందు రోజు చండీశ్వరుడి ప్రభోత్సవం ఉంటుంది. 25న సాయంత్రం 3.30గంటలకు రథాంగపూజ, రథాంగహోమం నిర్వహించాక, రథశాల నుంచి అంకాలమ్మగుడి, నందిమండపం వరకు రథోత్సవం జరుగుతుంది. సాయంత్రం 7గంటల నుంచి సదస్యం, నాగవల్లి కార్యక్రమాలుంటాయి. 26న ఉదయం 9.15 గంటలకు రుద్ర, చండీహోమాలకు పూర్ణాహుతి నిర్వహించి వసంతోత్సవం, కలశోద్వాసన, త్రిశూల స్నానం తదితర కార్యక్రమాలుంటాయి. అదేరోజు సాయంత్రం ఉత్సవాల ఆరంభసూచనగా ధ్వజారోహణ చేసిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ చేస్తారు. 27న భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంత సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
 
బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ చేసి ఉత్సవాలకు సకల దేవత ఆహ్వాన పూర్వక ధ్వజపటావిష్కరణ జరుగుతుంది. 18న భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లు çభృంగివాహనంపై దర్శనమిస్తారు. 19న హంసç, 20న మయూర, 21న రావణవాహనం, 22న పుష్పపల్లకీ మహోత్సవం, 23న గజవాహనం, 24న ప్రభోత్సవం, నంది వాహనసేవ, 25న రథోత్సవం, 26న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 27న అశ్వవాహన సేవలుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement