నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు | Srisailanlo from today Brahmotsava | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

Published Tue, Feb 10 2015 7:23 AM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM

Srisailanlo from today Brahmotsava

  • ఉదయం 8.30గంటలకుయాగశాల ప్రవేశం
  •  సాయంత్రం 7 గంటలకు ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ
  •  14న రాష్ట్రప్రభుత్వం,టీటీడీ తరుపున పట్టువస్త్రాల సమర్పణ
  • శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం కలిసివెలసిన శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూజలు ప్రారంభమవుతాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభపూజలలో భాగంగా మంగళవారం ఉదయం 8.30 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనము, శివసంకల్పం, చండీశ్వర పూజ, ఋత్విగ్వరణము, 10 గంటలకు అఖండస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్ర కలశ స్థాపన పూజలను నిర్వహిస్తారు.

    అలాగే సాయంత్రం 5.30 గంటల నుంచి అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రి 7 గంటలకు త్రిశూలపూజ, భేరీపూజ, సకల దేవతాహ్వాన పూర్వక ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, బలిహరణలు జరుగుతాయి. ఈ నెల 11 నుంచి 19 వరకు ప్రతిరోజూ ఉదయం 7.30 గంటల నుంచి చండీశ్వరపూజ, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, శ్రీస్వామివార్లకు విశేషార్చనలు,అమ్మవారికి నవావరణార్చనలు జరుగుతాయి. అలాగే ప్రతిరోజు ఉత్సవాలు ముగిసే వరకు ఉదయం 9 గంటలకు రుద్రహోమం, చండీహోమాలను నిర్వహిస్తారు. 10 గంటలకు నిత్యబలిహరణలు, సాయంత్రం 5.30 గంటల నుంచి నిత్యపూజలు, అనుష్ఠానములు, నిత్యహవనములు, బలిహరణలుంటాయి.
     
    14న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ తరుపున పట్టువస్త్రాల సమర్పణ


    మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సాంప్రదాయానుసారం ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలను స్వామిఅమ్మవార్లకు సమర్పిస్తారు. దీనికి ముందుగా ప్రధానాలయరాజగోపురం వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలను చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాలైన ఫలపుష్పాదులను సమర్పించి ఆలయప్రదక్షిణ చేసిన తరువాత పట్టువస్త్రాలను సమర్పిస్తారు.
     
    17న మహాశివరాత్రి, బ్రహ్మోత్సవ కల్యాణం

    బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 17న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకు సాయంత్రం 7గంటల నుంచి నందివాహనసేవ, ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. రాత్రి 10.30 గంటల నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 10.30 గంటల నుంచి పాగాలంకరణ, రాత్రి 12 గంటల తరువాత శాస్త్రోక్తంగా శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి చంద్రావతి కల్యాణమండపాన్ని సిద్ధం చేస్తున్నారు.
     
    బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు

    మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 10న ధ్వజావరోహణ చేసి ఉత్సవాలకు సకల దేవత ఆహ్వాన పూర్వక ధ్వజపటావిష్కరణ చేస్తారు. మరుసటి రోజు 11న శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లు హంస వాహనంపై దర్శనమిస్తారు. 12న మయూర వాహనం, 13న భృంగి వాహనం, 14న రావణ వాహనం, 15న స్వామిఅమ్మవార్ల పుష్పపల్లకీ మహోత్సవం ఉంటుంది. 16న గజవాహనసేవ, 17న  ప్రభోత్సవం, నందివాహనసేవ, 18న రథోత్సవం,19న ధ్వజావరోహణ, 20న అశ్వవాహనసేవ జరగుతుంది.
     
    18న రథోత్సవం

    మహాశివరాత్రి పర్వదినాన వధూవరులైన శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను 18న అంగరంగ వైభవంగా రథంపై ఆవహింపజేసి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనికి ముందు రోజు 17న చండీశ్వరుడిని ప్రభోత్సవం ఉంటుంది. 18వ తేదీ సాయంత్రం 3.30 గంటలకు రథాంగపూజ, రథాంగహోమం నిర్వహించాక, రథశాల నుంచి అంకాలమ్మగుడి, నందిమండపం వరకు రథోత్సవం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి సదస్యం, నాగవల్లి కార్యక్రమాలు ఉంటాయి. 19న ఉదయం 10.45 గంటలకు రుద్ర,చండీహోమాలకు పూర్ణాహుతి నిర్వహించి వసంతోత్సవం, కలశోద్వాసన, త్రిశూల స్నానం తదితర విశేష కార్యక్రమాలు ఉంటాయి. అదేరోజు సాయంత్రం ఉత్సవాల ఆరంభసూచనగా ధ్వజారోహణ చేసిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ చేస్తారు. ఈ నెల 20న శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంత సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement