కర్నూలు జిల్లా పరిషత్ : దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం.. ఒక దేశం తలరాత మార్చేది వారే.. విద్యావంతులందరూ ఓటు వేస్తేనే మంచి నాయకుడ్ని ఎన్నుకునే అవకాశం వస్తుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సీహెచ్ విజయమోహన్ అన్నారు. కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆదివారం ఏర్పాటు చేసిన జాతీయ ఓటరు దినోత్సవ వేదికపై ఆయన మాట్లాడారు. తైవాన్, సింగపూర్, మలేషియా, జపాన్ దేశాలు మనకన్నా చాలా చిన్నవని, కానీ అభివృద్ధిలో అవి ప్రపంచ ఆర్థిక స్థాయిని శాసిస్తున్నాయని చెప్పారు.
అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్నట్లే మన దేశంలోనూ వనరులు ఉన్నాయన్నారు. కానీ అక్కడి ప్రజల ఆలోచన తీరు వేరని, అందుకే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. భిక్షమెత్తుకునే స్థాయి నుంచి దక్షిణకొరియా నేడు డొనేషన్లు ఇచ్చే స్థాయికి చేరిందన్నారు. అక్కడి తలసరి ఆదాయం రూ.22 లక్షలుగా ఉంటే మన దేశ తలసరి ఆదాయం రూ.75 వేలేనన్నారు. మన దేశంలో ఈ పరిస్థితి మారాలంటే ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలన్నారు. డబ్బు తీసుకుని ఓటేసే దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదని చెప్పారు.
ఐదేళ్లు పాలకులను శాసించగలిగే స్థాయిలో ఓటర్లు ఉన్నారని తెలిపారు. పేదలు, మురికివాడల్లోని ప్రజలతో పాటు విద్యావంతులూ ఓటు హక్కు వినియోగించుకుంటే మంచి నాయకులు వస్తార ని డీఐజి రమణకుమార్ అన్నారు. పేదలు, మురికివాడల్లో 70 శాతం, విద్యావంతులుండే ప్రాంతాల్లో 30 శాతం ఓటింగ్ జరుగుతోందని కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి తెలిపారు. ధన, కుల ప్రభావం ఓటర్లను ప్రలోభపెట్టే వ్యవస్థలో ఉన్నామన్నారు. ఓటు ప్రాథమిక హక్కుతో పాటు ప్రాథమిక బాధ్యత కూడానన్నారు.
18 ఏళ్ల దాటిన బాలుర కంటే బాలికలే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు. ఓటు హక్కు ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని ఎస్పీ రవికృష్ణ అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని ఆయన యువతను కోరారు. ఎన్నికల రోజు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా మన భవిష్యత్‌ను మార్చే ఓటును సద్వినియోగం చేసుకోవాలని ూట్లాడుతూ సూచించారు.
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలాల్లోని పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన 30 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరితో పాటు ప్రశంసాపత్రాన్ని, 2కె రన్‌లో విజేతలైన 8 మంది విద్యార్థులకు నగదు బహుమతులు, జిల్లాలో ఐదుసార్లు ఎన్నికల్లో వరుసగా ఓటు వేసిన ఆరుగురు సీనియర్ సిటిజన్లకు కలెక్టర్, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ట్రైనీ కలెక్టర్ లక్ష్మీషా, రాయలసీమ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ చక్రవర్తి, డీఆర్‌ఓ జి.గంగాధర్‌గౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ మూర్తి, డీఈఓ సుప్రకాశ్, డీఎస్పీ రమణమూర్తి, కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, టీడీపీ నాయకుడు సతీశ్‌చౌదరి, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దేశ తలరాతను మార్చేది యువతే
Published Mon, Jan 26 2015 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM
Advertisement
Advertisement