క్షతగాత్రుడిని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న సహాయక సిబ్బంది
దుబాయ్: అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 188కి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్‌పై దాడి ఖడ్గం ఝుళిపించింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
బుధవారం మధ్యాహ్నం మూడింటపుడు కెర్మాన్ నగరంలోని ఖాసిమ్ సులేమానీకి నివాళిగా ఆయన సమాధి దగ్గర నాలుగో సంస్మరణ ర్యాలీ జరుగుతుండగా సాహెబ్ అల్–జమాన్ మసీదు సమీపంలో రోడ్డుపై ఈ పేలుడు ఘటన జరిగింది. దారి పొడవునా వేలాది మంది సులేమానీ మద్దతుదారులతో ర్యాలీ కొనసాగుతుండగా సమాధికి 700 మీటర్లదూరంలో మొదటి పేలుడు సంభవించింది.
గాయపడిన వారిని కాపాడేందుకు జనం, ఎమర్జెన్సీ విభాగ సభ్యులు భారీ సంఖ్యలో గుమికూడుతుండగా సమాధికి ఒక కిలోమీటర్ దూరంలో మరో భారీ పేలుడు సంభవించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారి ఆర్తనాదాలు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ఘటనాస్థలి భీతావహంగా తయారైంది. ఇది ఉగ్రదాడేనని కెర్మాన్ నగర డెప్యూటీ గవర్నర్ రహ్మాన్ చెప్పారు. అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఎవరూ ప్రకటించుకోలేదు.
ఎవరీ సులేమానీ?
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లోని కీలక ఖుర్డ్స్ ఫోర్స్‌కు మేజర్ జనరల్ సులేమానీ నేతృత్వం వహిస్తుండేవారు. ఖుర్డ్స్‌ఫోర్స్ అనేది విదేశీ సైనిక వ్యవహారాల విభాగం. సైన్యం కోసం ఆయుధాలు, నిధుల సేకరణ, నిఘా, సరకుల రవాణా బాధ్యతలను ఈ దళమే చూసుకుంటుంది. ఇరాన్‌కు మద్దతు పలికే గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటెంట్ గ్రూప్‌కు, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్‌కు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకూ సాయపడుతుంది. దీనిని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గతంలో ప్రకటించింది.
ఎందుకు చంపారు?
2020 జనవరిలో ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంక్యూ9 రీపర్ డ్రోన్ సాయంతో అమెరికా సులేమానీని హతమార్చింది. ‘‘ 1998లో ఖుర్డ్స్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇరాక్, సిరియాలో లక్షలాది మంది అమాయకుల మరణాలకు సులేమానీ కారకుడు. ప్రపంచ నంబర్‌వన్ ఉగ్రవాది అయినందుకే అతడిని అంతమొందించాం’ అని నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి రోజున ప్రకటించారు. దీంతో ఆగ్రహంతో ఇరాన్ అప్పట్లో ప్రతీకార దాడులకు దిగడం తెల్సిందే.
ఇరాన్ సైన్యాన్ని పటిష్టవంతం చేయడంలో సులేమానీది కీలక పాత్ర. అందుకే ఇరాన్ వ్యాప్తంగా సులేమానీకి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. నేషనల్ ఐకాన్‌గా కీర్తింపబడ్డారు. 2011లో అరబ్ ఉద్యమం తర్వాత సిరియాలో బషర్ అస్సాద్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. కానీ ఈ ఘటనలో సిరియాలో అంతర్యుద్ధం రాజుకుని అది ఇప్పటికీ రగులుతూనే ఉంది.
2018లో ప్రపంచ ఆర్థిక శక్తులు కీలక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగాక ఇరాన్ సైనిక నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ట్రంప్ సర్కార్ ఇచి్చన ఆదేశాలతో సులేమానీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో అప్పట్లో సంచలనమైంది. సులేమానీ హత్యేకాదు అంత్యక్రియల ఘటనా వార్తపత్రికల పతాకశీర్షికలకెక్కింది. 2020లో వేలాదిమంది పాల్గొన్న అంత్యక్రియల్లో తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment