ఇరాన్ స్పష్టీకరణ
టెహ్రాన్: అమెరికా ఎన్నికల ప్రచారంవేళ మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యోదంతంలో తమ ప్రమేయం అస్సలు లేదని ఇరాన్ స్పష్టంచేసింది. రెండేళ్లక్రితం ఇరాక్‌లో ఇరాన్‌కు చెందిన సైన్యాధికారి జనరల్ ఖాసిం సులేమానీని ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైనిక డ్రోన్ దాడిచేసి అంతంచేసింది.
దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆనాడు ఇరాన్ చేసిన ప్రతిజ్ఞకు, ట్రంప్ హత్యకు సంబంధం ఉండొచ్చన్న ఆరోపణల నడుమ ఇరాన్ బుధవారం స్పందించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కసీర్ కనానీ ఇరాన్ అధికారిక ఐఆర్‌ఎన్‌ఏ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘‘ ట్రంప్ మేం దాడి చేయించామంటున్న వార్తల్లో వీసమెత్తు నిజం లేదు. మా సైనిక కమాండర్ సులేమానీని అంతం చేసినందుకు ట్రంప్‌ను అంతర్జాతీయంగా చట్టప్రకారం శిక్షార్హుడిని చేస్తాం. అంతేగానీ ఇలా హత్య చేయబోం’’ అని ఆయన అన్నారు.
ఇరాన్ నుంచి ముప్పు నేపథ్యంలో ఇప్పటికే భద్రత పెంపు
ట్రంప్ హత్యకు ఆగంతకుడు విఫలయత్నం చేయడంతో ట్రంప్‌పై గతంలో కక్షగట్టిన ఇరాన్ పేరు మరోసారి తెరమీదకొచ్చింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ కమాండర్ సులేమానీని అమెరికా బలగాలు నాటి అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే అంతమొందించాయని ఇరాన్ ఆరోపిస్తోంది. దీంతో ట్రంప్ అంతానికి ఇరాన్ కుట్ర పన్ని ఉండొచ్చని అమెరికా నిఘా వర్గాలు భావించాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్‌కు కొన్ని వారాల క్రితమే భద్రతను మరింత పెంచారు. అయితే ఇరాన్‌కు, ఆగంతకుడి దాడి ఘటనకు మధ్య సంబంధాన్ని అమెరికా నిఘా, దర్యాప్తు వర్గాలు సహా ఎవరూ నిర్ధారించలేకపోతున్నారు. అయితే ఇరాన్ నుంచి ముప్పు ఉందని, జాగ్రత్తగా ఉండాలని అమెరికా సీక్రెట్ సర్వీస్, ట్రంప్ ప్రచార బృందానికి గతంలోనే ముందస్తు హెచ్చరికలు చేశామని అమెరికా జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పారు.
దాడి జరగొచ్చని, తగు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని మాకు తరచూ సందేశాలు వస్తూనే ఉన్నాయని యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి ఆంటోనీ చెప్పారు. ‘ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు ఉంది. సులేమానీని చంపేశాక ఇది మరింత ఎక్కువైంది’ అని అధ్యక్షభవనం వైట్‌హౌజ్‌లో జాతీయ భద్రతా మండలి మహిళా అధికార ప్రతినిధి ఆండ్రినీ వాట్సన్ చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా జాన్ బోల్టన్ ఉండేవారు. ఆయనను చంపాలని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ కోర్ సభ్యుడు కుట్ర పన్నాడు. ఆ సభ్యునిపై 2022లో న్యాయశాఖ నేరాభియోగాలు మోపింది. ‘ట్రంప్‌ను కోర్టులో చట్టప్రకారం శిక్షపడేలా చేస్తాం. అంతేగానీ ఇలా చంపబోం’ అని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ తాజాగా స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment