ఎస్కేయూ ఉద్యోగులకు మెమోలు జారీ
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని 77 మంది ఉద్యోగులకు మూకుమ్మడిగా మెమోలు జారీ చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం వర్సిటీ పాలకభవనం బంద్ చేయించారు. దీంతో ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో సోమవారంలోగా వివరణ ఇవ్వాలని రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ మెమోలు జారీ చేశారు.
వర్సిటీలోని ఫైనాన్స్, ఇంజినీరింగ్, సీడీసీ డీన్, యూజీసీ డీన్, ఎస్టాబ్లిష్మెంట్ ఏఆర్, అకడమిక్ డీఆర్లు ఆయా విభాగాల్లోని ఉద్యోగులందరితో వివరణ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే నకిలీ బదిలీ సర్టిఫికెట్లతో కోర్సుల్లో అడ్మిషన్ పొందిన టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు సురేష్‌నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేసిన వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సి.నరసింహారెడ్డి, నాయకుడు వై. భానుప్రకాష్‌రెడ్డి, పరిశోధక విద్యార్థి జి.జయచంద్రారెడ్డిలను సస్పెండ్ చేయాలని రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్‌కు సిఫార్సు చేశారు. ఇదే విషయంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డిపై ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఏ తప్పూ చేయకపోయినా చర్యలు తీసుకోవడంతో ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎస్కేయూ ఉన్నతాధికారుల నిరంకుశవైఖరికి నిరసనగా సోమవారం నుంచి ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళనబాట పట్టనున్నారు.