అమ్మా, నాన్నను చూడాలి
ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు యాంగ్. పొద్దున్నే బుద్ధిగా బడికెళ్తుంది. సాయంత్రం తమ పొలంలో పండిన కూరగాయలమ్ముతూ హోం వర్క్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ బోర్డు మీద చైనీస్ భాషలో ఏం రాసిందో తెలుసా? ‘అమ్మానాన్నా.. నన్ను పుట్టగానే మీరు వదిలేశారు. నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను.. మీ కోసం ఎదురుచూస్తున్నాను’ అని. ఇలా ఎందుకు రాసిందో తెలియాలంటే ముందుగా యాంగ్ గురించి తెలుసుకోవాలి. 2008లో సిచువాన్ ప్రావిన్స్‌కి చెందిన శరణార్థులైన దంపతులకు యాంగ్ జన్మించింది.
నెలలు నిండకుండానే కాదు... న్యుమోనియాతో పుట్టింది. దాంతో ఆ పాపకు చికిత్స చేయించే స్తోమత లేదనుకున్నారేమో ఆ దంపతులు ఓ ఇంటి ముందు వదిలి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి మెంగ్వీ అనే మహిళ యాంగ్‌ను పెంచింది. అయితే కని వదిలేసి వెళ్లిపోయిన అమ్మానాన్నలపై యాంగ్‌కి కోపం లేదు. ఎప్పటికైనా వారి ఒడిలో చేరాలని ఆరాటపడుతోంది. అందుకే ఇలా అన్వేషిస్తోంది. మరి యాంగ్ ప్రయత్నం ఫలించాలని, తల్లిదండ్రుల ఒడికి క్షేమంగా చేరాలని మనమంతా ఆశిద్దాం.