సేఫ్ సైకిల్
మహిళగా పుట్టడం మహాభాగ్యమైనా మహిళలకు సామాజికంగా మానసికంగా ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. ఆ కష్టాలు చాలవన్నట్లు ప్రకృతి ఇచ్చిన ఇంకో కష్టం రుతుచక్రంలో అపశ్రుతులు. ఈ కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? మెన్స్ట్రువల్ సైకిల్‌ను సేఫ్‌గా ఎలా చేసుకోవాలో తెలుసుకోడానికే ఈ సమగ్ర ప్రత్యేక కథనం.
మెన్స్ట్రువల్ సమస్యలు – మహిళలకు సూచనలు
మరో జీవిని సృష్టించడం కోసం ప్రతి జీవీ తపన పడుతుంది. సృష్టి ధర్మం ఇది. ఈ ధర్మాన్ని నెరవేర్చడం కోసం పురుషులు, మహిళల్లో వేర్వేరు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఇందుకు మహిళల్లో కొనసాగే క్రతువే రుతుక్రమం. ఈ రుతుక్రతువు ప్రతినెలా సజావుగా సాగాలంటే ఎన్నో సంక్లిష్టతలతో కూడిన సమతౌల్యాలు అవసరం. అవన్నీ సమంగా సాగితేనే సక్రమంగా వస్తుంది నెలసరి. నిజంగా నెలసరి సరిగా రావడం అన్నది మహళకు సిరి. ఈ సంక్లిష్ట హార్మోన్లలో ఏ ఒక్కదానిలో కాస్త తేడా ఏర్పడ్డా నెలసరి అస్తవ్యస్తం. అంటే సైకిల్ సరిగ్గా నడవదన్నమాట. అందుకే యుక్తవయసు మహిళ గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లగానే మొదట అడిగే మాట ‘నెలసరి సరిగానే వస్తోందా?’ అని. అంతటి ప్రాధాన్యం ఉంటుందా ప్రశ్నకు. రుతుక్రమం సక్రమంగా వచ్చేందుకు అవకాశాలూ, రాకపోవడానికి కారణాలు తెలుసుకొని... మహిళ తన సైకిల్‌ను సేఫ్‌గా ఉంచుకోడానికి అవసరమైన అవగాహన కోసం...
ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్
రుతుస్రావం మొదలయ్యే కొంత కాలం ముందుగా ఈ బాధలు కనపడుతుంటాయి. కాబట్టి దీనిని పీ–మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అంటారు. హార్మోన్ల పరిమాణాల్లో మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పీఎంఎస్‌తో బాధపడే మహిళలు అత్యంత తీవ్రమైన భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంటారు. వేగంగా, విపరీతంగా కోపం తెచ్చుకోవడం, టెన్షన్, తీవ్రమైన విచారం వంటి భావోద్వేగాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొందరిలో ఇలాంటి మానసికమైన ఉద్వేగాలు లేకుండా కేవలం శారీరకమైన బాధలు మాత్రమే ఉంటాయి. అంటే కండరాలు బిగదీసుకు పోవడం (ముఖ్యంగా పొట్ట కండరాలు), కింది నుంచి గ్యాస్ పోతుండటం వంటివి ఇబ్బంది పెడతాయి. రుతుక్రమం రాబోయే ముందు కనిపించే ఈ బాధలన్నీ రుతుస్రావం మొదలయ్యాక క్రమంగా తగ్గిపోతాయి. కొందరు యువతుల్లో ఈ బాధలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే... అవి రోజువారీ జీవితాన్ని సజావుగా సాగనివ్వవు.
ఆ సమయంలో కనిపించే కొన్ని తీవ్ర ఇబ్బందులివే...
⇒ఎవరైనా పలకరిస్తే తీవ్రంగా విసుక్కోవడం ∙
⇒త్వరగా కోపం తెచ్చుకోవడం
⇒తీవ్రమైన వెన్నునొప్పులు
⇒తలనొప్పి, ∙రొమ్ములలో సలపరం
⇒మొటిమలు
⇒ఎప్పుడూ ఏదో తినాలనిపించడం
⇒తీవ్రమైన నిస్సత్తువ
⇒వ్యాకులత (డిప్రెషన్)
⇒యాంగై్జటీ
⇒తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న భావన
⇒నిద్రలేమి
⇒మలబద్దకం
కడుపు కండరాలు తీవ్రంగా బిగదీసుకుపోయి విపరీతంగా నొప్పిని కలిగించడం వంటివి...
ఉపశమనం ఇలా : ఉప్పును తగ్గించడం లేదా పరిమితంగా తీసుకోవడం, కాఫీ వంటి కెఫిన్ ఉండే ద్రవాల జోలికి పోకపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వంటివి పీఎంఎస్ లక్షణాలను తగ్గిస్తాయి. క్యాల్షియమ్, విటమిన్ – డి సప్లిమెంట్లు వాడటం కూడా చాలావరకు ఉపయోగపడుతుంది.
‘ప్యూబర్టీ’తో మొదలు... ‘మెనోపాజ్’తో ముగింపు
మహిళ జీవితంతో దాదాపు సమాంతరంగా సాగే ఈ రుతుక్రమం ‘సైకిల్’ తాను వ్యక్తురాలు కాగానే (ప్యూబర్టీ అటెయిన్ చేయగానే) మొదలై మెనోపాజ్‌తో ఆగుతుంది. అప్పటి వరకూ క్రమం తప్పకుండా నడుస్తూనే ఉంటుందీ ‘సైకిల్’.
రక్తస్రావం అయ్యే రోజు ‘డేట్’...
నెల తర్వాత రుతుస్రావం వచ్చే రోజును వాడుక భాషలో ‘డేట్’ వచ్చిందా అని అడుగుతుంటారు. అది వచ్చాక నాలుగైదు రోజులు ఉంటుంది కాబట్టి ఆ వ్యవధి ‘పీరియడ్’. తన నుంచి మరో చిన్నారికి జన్మనివ్వడానికి ఒక మహిళ తన దేహాన్ని సంసిద్ధపరచేందుకు అవసరమైన జీవ, రసాయన ప్రక్రియలన్నీ ఈ ‘పీరియడ్’లో క్రమం తప్పకుండా చోటు చేసుకుంటుంటాయి. ఏదైనా క్రమం తప్పితే... ఆ ‘అ’క్రమతే సమస్యగా ముందుకొస్తుంది. ముంచుకొస్తుంది.
►సైకిల్ నడిపే అనేక డ్రైవర్లు ‘హార్మోన్లు’...
మహిళకు వచ్చే ఈ సైకిల్‌ను ఏమాత్రం క్రమం తప్పకుండా నడిపేవి ‘హార్మోన్లు’. అందుకే ఏమాత్రం అంతరాయం రాకుండా నడపాలంటే ప్రతి హార్మోన్ అత్యంత సక్రమంగా పనిచేయాలి. వాటిల్లో ఏ హార్మోన్ కాస్త క్రమం తప్పినా సైకిల్ దెబ్బతింటుంది. ప్రతి మహిళలోనూ సైకిల్ (రుతుస్రావం) మొట్టమొదట ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌తో మొదలవుతుంది. ఇది అండాశయం (ఓవరి)లోని అండాన్ని అభివృద్ధి చెందేలా చేస్తుంది. ఈ ప్రక్రియలను ఓవ్యులేషన్ అంటారు. ఇందులో అండం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది.
►తర్వాతి స్టెప్ ప్రో – జెస్టెరాన్...
ఓవ్యులేషన్ జరిగాక గర్భసంచిలోని లోపలి లైనింగ్ పొరలు కాస్త మందంగా మారుతాయి. ఇలా మారేందుకు ప్రోజెస్టెరాన్ అనే హోర్మోన్ త్పోడుతుంది. ప్రో... అంటే ముందుదశ... అని అర్థం. జెస్టెషన్ అంటే గర్భధారణ... రాన్ అంటే అందుకు సిద్ధం చేసే హార్మోన్. ఓవ్యులేషన్లో అభివృద్ధి జరిగిన ‘అండం’ గనక... వీర్యకణ సంపర్కంతో ‘పిండం’గా రూపొందితే... ఆ పిండం సక్రమంగా పెరగడానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్ల కోసమే ఈ ‘ప్రో’... ‘జెస్టెషన్’ ఏర్పాట్లన్నటమాట. ఈలోకంలోకి రాబోయే చిన్నారి అతిథి కోసం ప్రకృతి చేసిన అద్భుత ఏర్పాటిది. అండంతో వీర్యకణం సంపర్కం చెంది పిండంగా ఏర్పడితే జరిగేది ఇక అది క్రమంగా పెరగడమే.
►గర్భం రాకపోతే...
మరి ఒకవేళ గర్భం రాకపోతే... సుమారు నెలరోజుల్లో ఆ డేట్‌కి రుతుస్రావం మొదలవుతుంది. పిండానికి మంచి ఆవాసం ఇవ్వడం కోసం మందంగా మారిన లైనింగ్ పొరలు... గర్భధారణ జరగనప్పుడు క్రమంగా క్షీణించిపోతాయి. అలా క్షీణించే సమయంలో అవి రక్తస్రావాన్ని వెలువరుస్తాయి. దాంతో ఆ పీరియడ్ ముగుస్తుంది. మళ్లీ దేహం మరో పీరియడ్‌కు కావాల్సిన ఏర్పాట్లను చేసుకోవడం మొదలు పెడుతుంది. అంటే మరో సైకిల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదీ ఒక నెల వ్యవధిలో సాగే క్రమం. అత్యంత సక్రమం. కానీ ఏదైనా కారణాల వల్ల ఈ సైకిల్లో క్రమత్వం తప్పే అవకాశాలు, దాంతో సమస్య ఏర్పడే పరిస్థితులు నెలకొంటాయి.
రుతుసంబంధ సమస్యలు – నిర్ధారణ పరీక్షలు
రుతుక్రమానికి సంబంధించిన అనేక సమస్యల నిర్ధారణ కోసం సాధారణంగా కొన్ని పరీక్షలు చేస్తుంటారు. అవే... ∙ఎండోమెట్రియల్ బయాప్సీ (ఇందులో యుటెరస్లోని చిన్న పొరను తొలగించి, దాన్ని విశ్లేషణకు పంపుతారు) ∙హిస్టెరోస్కోపీ (ఒక చిన్న గొట్టానికి కెమెరా అమర్చి గర్భసంచిలోకి పంపి, అక్కడి అబ్నార్మాలిటీస్ ఏవైనా ఉన్నాయేమోనని తెలుసుకుంటారు ∙అల్ట్రాసౌండ్ పరీక్ష (ఇందులో శబ్దతరంగాల సహాయంతో గర్భసంచి ఎలా ఉందో తెలుసుకుంటారు).
రుతుక్రమం ఆగిపోయిన తర్వాత (మెనోపాజ్) వచ్చే సమస్యలు
మహిళల సంతానోత్పత్తి వయసు దాటాక రుతుక్రమం కూడా ఆగిపోతుంది. దీన్ని మెనోపాజ్ అంటారు. ఈ సాధారణ పరిణామం కొందరిలో మరిన్ని సమస్యలు తెస్తుంది. ఉదాహరణకు మూడ్స్ సరిగా లేకపోవడం, మాటిమాటికీ భావోద్వేగాలకు లోనుకావడం, ఒంట్లోంచి ఆవిర్లు... వంటివి. ఈ లక్షణాలను బట్టి మెనోపాజ్ తర్వాత జీవితాన్ని సాధారణంగా ఉండేలా చేయడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వంటి అనేక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి.
రుతుక్రమానికి సంబంధించి సమస్యలు మహిళలందరిలోనూ ఒకేలా ఉండవు. వేర్వేరు యువతులు వేర్వేరు తరహా రుతు సమస్యలను ఎదుర్కొంటు ఉంటారు. తమ సైకిల్ విషయంలో వారు ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యమైనవి కొన్ని ...
మెనోరియా...
పీరియడ్స్ సమయంలో చాలా ఎక్కువగా రక్తం పోతుండటాన్ని మెనోరియా అంటారు. పీరియడ్స్ సమయంలో 80 ఎం.ఎల్. వరకు రక్తస్రావం సాధారణం. అంతకు మించితే ఇబ్బందికరం. హార్మోన్ల అసమతౌల్యతే దీనికి ప్రధాన కారణం. కొందరిలో భారీగా అయ్యే ఈ రక్తస్రావం 5 నుంచి 15 రోజులు, మరికొందరిలో అంతకు మించి కూడా కొనసాగుతుంది. కొన్నిసార్లు రక్తపు గడ్డలుగా కూడా రుతుస్రావం అవుతుంటుంది. రుతుక్రమం మొదలైన మొదటి రెండురోజుల్లో ఉండే తీవ్రత నాలుగు, ఐదు రోజుల వరకు కూడా కొనసాగుతుంది. ఇలాంటప్పుడు కారణాలను తెలుసుకోడానికి వైద్యపరీక్షలు చేయించాలి. రక్తహీనత (అనీమియా) ఉన్న మహిళలకు రుతుసమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. అసలే రక్తం తక్కువగా ఉండడం, దానికి తోడు మళ్లీ ఎక్కువ రక్తం కోల్పోవడంతో తీవ్రమైన నిస్సత్తువ ఆవరిస్తుంది. రక్తంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కొరవడటంలో ఇలాంటి వారికి ఆయాసం వస్తుంటుంది. సాధారణ మోతాదుకు మించి రక్తస్రావం అవుతుందంటే... హైపోథైరాయిడిజమ్, ఫైబ్రాయిడ్స్, ఎడెనోమయోసిస్, యుటెరస్ (గర్భసంచి)లో లేదా గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్)లో ఇన్ఫెక్షన్లు వంటివి కారణం కావచ్చు. కారణాన్ని గుర్తించి తగిన చికిత్స అందిస్తారు. తొలి దశలో హార్మోన్ పిల్స్‌తో జీవన నాణ్యత మెరుగవుతుంది. దాంతో నయం కాకపోతే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.
►డిస్ మెనోరియా
పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి రావడాన్ని ‘డిస్మెనోరియా’గా వ్యవహరిస్తారు. సాధారణంగా పీరియడ్స్ మొదలు కాగానే... ఆ టైమ్‌లో పొత్తికడుపులో నొప్పి, పొట్ట, నడుము ప్రాంతపు కండరాలు అతిగా బిగదీసుకుపోయి తీవ్రంగా నొప్పి కలిగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్స్ సమయంలో కొద్దిపాటి నొప్పి ఉండటం సహజమే. కానీ తట్టుకోలేనంత నొప్పి ఉంటే ఫైబ్రాయిడ్స్, ఎడెనోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, పెల్విస్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వంటి ఇతర ఏవైనా సమస్యలు ఉన్నాయేమోనని ఒకసారి పరీక్ష చేయించుకోవాలి.
►ఉపశమనం కోసం
తాత్కాలిక ఉపశమనం కోసం పొట్ట దగ్గర వేడినీళ్ల కాపడం (హీటింగ్ ప్యాడ్) పెట్టడం, నొప్పి తగ్గడానికి డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు వాడటం వంటివి చేయవచ్చు. అంతటి నొప్పికి అసలు కారణాన్ని కనుగొని దానికి తగిన చికిత్స చేయించుకోవడం ద్వారా ఈ తరహా సమస్యనుంచి విముక్తి పొందవచ్చు. ఇలాంటి వారు విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మేలు.
వ్యవధి పరమైన సమస్యలిలా...
సాధారణంగా రుతుక్రమ చక్రం అంటే 28 రోజులు. చాలామందిలో క్రమం తప్పకుండా 28 రోజులకే పీరియడ్స్ మొదలవుతుంటే... కొందరిలో 25 రోజులకే వస్తుంటుంది. మరికొందరిలో 35 రోజులు పట్టవచ్చు. అదే నిడివి కొనసాగినా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఒకసారి 23 – 25 రోజులు... మరోసారి 32 – 35 రోజులు ఉంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌గా చెబుతారు. ఇక మరికొందరిలో నెలల తరబడి నెలసరి రాకపోవచ్చు కూడా. ఇలా జరుగుతున్నప్పుడు హార్మోన్ల స్రావాలలో అపసవ్యతలు ఉన్నాయనీ, అవి పీరియడ్స్ క్రమతపై ప్రభావం చూపుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు అసలు కారణం ఏమిటో తెలుసుకొని ఆ మూల కారణాన్ని సరిదిద్ది సైకిల్‌ను మళ్లీ ‘సేఫ్’గా కొనసాగేలా చూసుకోవాలి.
అమెనోరియా
కొందరిలో రావాల్సిన సమయానికి పీరియడ్స్ రావు. అవి వచ్చే దాఖలా కూడా కనిపించదు. ఇలా పీరియడ్స్ రాకుండా పోవడాన్ని వైద్య పరిభాషలో ‘అమెనోరియా’ అంటారు. పిల్లలకు పాలిచ్చే సమయంలో ‘అమెనోరియా’ సర్వసాధారణం. సాధారణంగా యుక్తవయసు నాటికి రుతుక్రమం మొదలువుతుంది. కానీ... ఈ వయసు దాటుతున్నా రుతుక్రమం రాకపోతే ‘ప్రైమరీ అమెనోరియా’ అంటారు. పుట్టుకతోనే ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు, గర్భసంచి (యుటెరస్) లేకపోవడం, అండాశయాలు (ఓవరీస్) పెరగకపోవడం వంటి సమస్యలు ఉంటే యుక్తవయసు వచ్చాక సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్... రొమ్ములు పెరగడం, బాహుమూలాలు, ప్రైవేట్ పార్ట్స్‌లో వెంట్రుకలు పెరగడం వంటివి జరగవు. దీన్ని ప్రైమరీ అమెనోరియా అనవచ్చు.
అయితే కొందరిలో సెంకడరీ సెక్సువల్ కారెక్టర్లు పెరిగినా 16వ ఏట వరకూ వ్యక్తురాలు కాకపోతే సెకండరీ అమెనోరియా అంటారు. ఇక కొందరిలో ఒకటి రెండు రుతుస్రావాలు కనిపించాక చాలా కాలం పీరియడ్ రాదు. దానిని సెకండరీ అమెనోరియా అంటారు. క్రమంతప్పకుండా నెలసరి వచ్చే వచ్చే మహిళల్లో కంటిన్యువస్‌గా మూడు నెలలు రుతుక్రమం రాకపోవడాన్ని అమెనోరియా అనవచ్చు. ఒకవేళ తొమ్మిది నెలల వ్యవధిలో అస్సలు రాకపోవడం, వచ్చీరానట్లుగా అనిపిస్తూ... అంటే... ఆ స్రావాలు తగినంతగా కాక ఏదో చుక్కలుగా రావడాన్ని ఆలిగోమెనిరియా అంటారు. అమెనోరియాకు సందర్భాన్ని బట్టి చికిత్స చేస్తుంటారు. ఉదాహరణకు గర్భనిరోధక మాత్రలు లేదా హార్మోన్ మాత్రలు ఇస్తారు. దాంతో రుతుక్రమం మొదలయ్యేందుకు అవకాశం ఉంది. థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథుల లోపాల వల్ల రుతుస్రావం ఆగిపోయిన వారికి తగిన మందులతో చికిత్స చేస్తారు. ఒకవేళ శరీర నిర్మాణంలో అడ్డంకులు ఉంటే, దాన్ని శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. ఇలాంటి ఏ లోపాలు లేనప్పుడు మహిళలకు మంచి పౌష్టికాహారం ఇవ్వడం, తగినంత విశ్రాంతి, ఆహ్లాదకరమైన జీవనశైలిని అనుసరించేలా చేయడం, ఒత్తిడిని తగ్గించడం వంటి వాటితో పీరియడ్స్‌ను పునరుద్ధరించవచ్చు.
ఇక్కడ పేర్కొన్నవి మహిళల్లో వచ్చే రుతుక్రమంలోని కొన్ని సాధారణ సమస్యలు మాత్రమే. ఇవి సక్రమంగా కొనసాగితే వారిది ‘సేఫ్ సైకిల్’గానే పరిగణించవచ్చు. ఇక్కడి పరిమిత సమాచారంలో మీ సమస్యలేమైనా ఉంటే వాటి గురించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోండి. అవగాహనను పెంపొందించుకోండి. తగిన చికిత్స తీసుకొని నిశ్చింతగా, నిర్భయంగా ఉండండి. ఇంకేమైనా అనుమానాలు ఉంటే మాకు రాయండి.
డాక్టర్ ప్రభా అగర్వాల్
సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్
మ్యాక్స్‌క్యూర్ సుయోషా
ఉమన్ అండ్ ఛైల్డ్ హాస్పిటల్స్
మాదాపూర్, హైదరాబాద్