మీకు శివమణి సినిమా గుర్తుందా?
లండన్: మీకు శివమణి సినిమా గుర్తుందా? సముద్రపు ఒడ్డుకు సీసాలో దొరికిన ఓ సందేశం ఆధారంగా నడిచే కథ అది. సరిగ్గా ఇలాంటి ఘటనే జర్మనీలోని ఆమ్రమ్ ద్వీపం తీరంలో వెలుగుచూసింది. ఈ సీసాను 108 ఏళ్ల క్రితం బ్రిటీష్ శాస్త్రవేత్తలు సముద్రంలోకి విసిరేశారు. ఇప్పటివరకు లభించిన సీసా సందేశాల్లోకెల్లా ఇదే పురాతనమైనదని సీసాలో ఉన్న సందేశం ద్వారా తెలుస్తోంది. మెరియన్ వింక్లర్ అనే మహిళకు ఈ సీసా దొరికినపుడు దాన్ని తెరవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాన్ని పగులగొట్టగా అందులో ఓ సందేశం లభ్యమైంది. ఈ సీసా దొరికిన వారు తిరిగి అప్పజెప్పితే షిల్లింగ్ (పాత బ్రిటీష్ నాణెం) ఇస్తామని రాశారు.
ఇది ఇంగ్లిష్, డచ్, జర్మన్ లిపిలో ఉంది. బ్రిటన్లోని ప్లిమౌత్కు చెందిన 'ద మెరైన్ బయలాజికల్ అసోసియేషన్' చిరునామా రాసి ఉంది. అసోసియేషన్ అధ్యక్షుడు జార్జ్ పార్కర్ బిడ్డర్ 1904 నుంచి 1906 మధ్యకాలంలో 1,020 సీసాలను ఇదే సందేశంతో సముద్రంలో విసిరేశారు. నీటి ఉపరితలంపై తేలుతూ ఉండేలా ప్రత్యేకంగా ఈ సీసాలను రూపొందించారు. సముద్ర అడుగు భాగాన నీటి ప్రవాహ ఉధృతిని అధ్యయనం చేసే ప్రాజెక్టులో భాగంగా వీటిని వదిలారు. సందేశంలో చెప్పినట్లుగా మెరియన్ వింక్లర్ దంపతులకు బహుమతిగా షిల్లింగ్ అందింది. కానీ, వారు 108 ఏళ్ల తరువాత దొరికిన సీసా కావడంతో దీన్ని గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా 99 ఏళ్ల తరువాత లభించిన సీసా పేరిట గిన్నిస్ రికార్డు ఉంది. ఇప్పుడు దాన్ని ఇది బద్దలు కొడుతుందని వీరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.