ఎప్పటికయ్యెన్?
=హైకోర్టు ఆదేశాలు పట్టని విద్యాశాఖ
=ఖరారుకాని నాన్‌లోకల్ టీచర్ల జాబితా
=610 జీఓ అమలులో తాత్సారం
=తుది లెక్కలు తేల్చని విద్యా శాఖ
సాక్షి ప్రతినిధి, వరంగల్ : స్థానికేతర ఉద్యోగులను గుర్తించి నివేదిక తయారు చేయడంలో జిల్లా విద్యా శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం స్థానికేతర ఉపాధ్యాయుల జాబితా రూపొందించాలని రాష్ట్ర విద్యా శాఖ ఆదేశించి రెండు నెలలు గడుస్తున్నా... జిల్లా అధికారులు మాత్రం ఇప్పటికీ తుది జాబితాను వెల్లడించడం లేదు. ప్రాథమిక నివేదిక ప్రకారం జిల్లాలో 163 మంది ఉపాధ్యాయులు స్థానికేతరులు ఉన్నట్లు సమాచారం. వీరి సర్వీసు అంశాలను మరోసారి పరిశీలించి తుది జాబితాను రూపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి 2001 వరకు నిర్వహించిన ప్రక్రియల్లో 70 శాతం స్థానికులకు, 30 శాతం మెరిట్ కోటా ఉండేంది. 2001 జూన్ తర్వాత స్థానికుల కోటా 80 శాతంగా పెంచారు. మిగిలిన 20 శాతాన్ని మెరిట్ కోటాగా నిర్ధారించారు. మెరిట్ కోటాలో స్థానికేతరులు నియమితులయ్యారు. ఇలాంటి నియామకాలపై విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా మెరిట్ కోటాలో నియమితులైన స్థానికేతరులను సొంత జిల్లాలకు పంపించి స్థానికులకు అవకాశమివ్వాలనే డిమాండ్ పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం 2007లో 610, ఇతర అనుబంధ జీఓలు జారీ చేసింది.
మెరిట్ కోటా స్ఫూర్తికి విరుద్ధంగా నియమితులైన స్థానికేతరులను సొంత జిల్లాలకు పంపించాలని ఆదేశించింది. దీని కోసం అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించింది. 610 జీఓ అమలుపై కొందరు ఉద్యోగులు ట్రిబ్యునల్‌కు వెళ్లారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేసేలా స్టే ఇవ్వాలని కోరారు. వీరి పిటిషన్లను పరిశీలించిన ట్రిబ్యునల్ బదిలీలపై స్టే విధించింది. ట్రిబ్యునల్ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 610 జీఓ అమలుకు ట్రిబ్యునల్ తీర్పు ఇబ్బందిగా ఉందని... తొలగించాలని పేర్కొంది. అన్ని అంశాలను పరిశీలించిన హైకోర్టు 610 జీఓ అమలుపై ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే ఉత్వర్వులను తొలగిస్తూ తీర్పు ప్రకటించింది. స్థానికేతరులను వారి సొంత జిల్లాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అన్ని శాఖలు ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టాయి.
విద్యా శాఖలోని స్థానికేతర ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఐదో తేదీన ప్రత్యేక మెమో జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యా శాఖ అన్ని జిల్లాలకు గత నెల ఏడున ప్రొసీడింగ్ ఇచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాలు స్థానికేతర ఉపాధ్యాయుల జాబితాలను రూపొందించడం ప్రాంభించాయి. అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ ముగిసినప్పటికీ... మన జిల్లాలో మాత్రం పూర్తికాకపోవడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు విద్యా శాఖ తీరును తప్పుబడుతున్నాయి.