Merkel
-
జర్మనీలో షోల్జ్ నేతృత్వంలో సంకీర్ణ కూటమి
బెర్లిన్: ఎంజెలా మెర్కెల్ తర్వాత జర్మనీ చాన్సెలర్‌గా బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే విషయంలో సందిగ్ధం వీడింది. ఒలాఫ్ షోల్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ‘ప్రోగ్రెసివ్’కూటమి అధికారపగ్గాలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై షోల్జ్‌కు చెందిన సోషల్ డెమోక్రాట్ పార్టీ, భాగస్వాములైన గ్రీన్ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్ నేతలు మంగళవారం సంతకాలు చేశారు. దీంతో, పార్లమెంట్లో స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రోగ్రెసివ్ కూటమి నేతగా బుధవారం షోల్జ్ ఎన్నికకు మార్గం సుగమమైంది. జర్మనీ తదుపరి చాన్సెలర్‌గా షోల్జ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చూపిన సహకారం భాగస్వామ్య పక్షాల మధ్య మున్ముందు కూడా కొనసాగితే, మాముందున్న లక్ష్యాలను సాధించడం చాలా తేలికవుతుంది. కరోనా మహమ్మారిని నిలువరించడం మా శక్తిసామర్థ్యాలకు పరీక్ష కానుంది’షోల్జ్ మీడియాతో అన్నారు. వాతావరణ మార్పులను అడ్డుకోవడమే కొత్త ప్రభుత్వ ప్రథమ ప్రాథాన్యం కానుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఆధునీకరణ, మరిన్ని ఉదారవాద సామాజిక విధానాలను ప్రవేశపెట్టడం కూడా షోల్జ్ ప్రభుత్వ లక్ష్యాలుగా ఉన్నాయి. కాగా, ఇప్పటికే నాలుగు పర్యాయాలు, 16 ఏళ్లపాటు ప్రభుత్వాధినేతగా కొనసాగి చరిత్ర సృష్టించిన ఎంజెలా మెర్కెల్ ఐదో దఫా చాన్సెలర్ ఎన్నిక బరి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. ఆమెకు చెందిన యూనియన్ బ్లాక్ సెప్టెంబర్‌లో జరిగిన ఓటమి పాలైంది. -
రాణిగారింటి పెళ్లికి మురికివాడల మైనా
మేఘన్ మెర్కెల్! కొత్త పెళ్లి కూతురు. ప్రిన్స్ హ్యారీ భార్య. ఏడాదిగా మెర్కెల్ గురించిన విశేషాలు ధారావాహికగా వచ్చాయి. బ్రిటన్ అంటేనే పెద్ద దేశం. అలాంటి పెద్ద దేశంలో, పెద్దింటికి కోడలిగా వెళ్తున్న అమ్మాయి అంటే సహజంగానే ప్రపంచానికి ఈ ‘సాధారణ యువతి’ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఎలా ప్రేమలో పడిందీ, పెళ్లి ఎప్పుడు నిశ్చయం అయిందీ అనే విశేషాల నుంచి.. ఆమెకున్న కాలిగ్రఫీ (సొగసైన చేతిరాతలో నైపుణ్యం) హాబీ వరకు మెర్కెల్ గురించి ప్రతిదీ ప్రధానంగా ఆకర్షించే అంశమే అయింది. మొత్తానికి శనివారం మెర్కెల్, హ్యారీల వివాహం ‘నిరాడంబరమైన వైభవం’తో జరిగింది. మన దేశం నుంచి ఒకరిద్దరికి మాత్రమే పెళ్లి పిలుపు అందింది. ఆ ఒకరిద్దరి లో ముంబై మురికివాడల్లో ఉన్న ‘మైనా’ అనే స్వచ్ఛంద మహిళా సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారు! ఆత్మీయ అతిథిగా ‘మైనా’! ప్రిన్స్ చార్లెస్ డయానాను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లిని నేరుగా కానీ, టీవీల్లో కానీ కోట్లాది మంది చూశారు. ఇప్పుడు డయానా చిన్న కొడుకు హ్యారీ పెళ్లికి కూడా అంతే ప్రాధాన్యం లభించింది. యువరాజు పెళ్లిని ఇంట్లో పెళ్లిలా ఇష్టంగా చూశారు మన దేశ ప్రజలు. అదేస్థాయిలో ఈ పెళ్లి కోసం ఎదురు చూశారు కూడా. ముంబయి డబ్బావాలాలైతే.. తమకు తెలిసిన వాళ్లతో మెర్కెల్‌కు పైథానీ చీర, హ్యారీకి కుర్తా, తలపాగాను బహుమతిగా పంపించారు. ఇక విశిష్ట అతిథుల కేటగిరీలో ప్రియాంక చోప్రా పెళ్లికి వెళ్లొచ్చారు. ఆత్మీయమైన అతిథిగా పైన మనం చెప్పుకున్న ‘మైనా’ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా కూడా ఇన్విటేషన్ అందుకున్నారు. ఆహ్వానం ఎలా వచ్చింది? గత ఏడాది జనవరిలో మేఘన్ మెర్కెల్ ముంబయికి వచ్చి ధారవీ బస్తీ మహిళలతో, ‘మైనా’ ప్రతినిధులతో కలివిడిగా కూర్చుని కబుర్లాడి వెళ్లారు. ‘మైనా’ ప్రత్యేక ఆహ్వానంపై ముంబై వచ్చిన మెర్కెల్.. స్త్రీ సాధికారత దిశగా పనిచేస్తున్న ఈ మహిళల నుంచి స్ఫూర్తి పొందారు. రాయల్ వెడ్డింగ్‌కి ‘మైనా’ ప్రతినిధులకు ఆహ్వానం అందడానికి ఇదే ప్రధాన కారణం. యువరాజు పెళ్లికి ఆహ్వానం అందుకున్న ఏడు విదేశీ ఎన్జీవోలలో మన ‘మైనా’ ఒకటి. మెర్కెల్ ఇండియాకి రావడానికి కారణం 23 ఏళ్ల సుహానీ జలోటా. సుహానీ యు.ఎస్.లోని డ్యూక్ యూనివర్సిటీ స్టూడెంట్. చురుకైన విద్యార్థి. ఎంటర్ప్రెన్యూరియల్ ఫెలోషిప్‌లో భాగంగా ముంబైలో ‘మైనా మహిళా ఫౌండేషన్’ ప్రారంభించింది. రుతుక్రమ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పట్ల మహిళలకు అవగాహన కల్పించడం, పేద మహిళలకు తక్కువ ధరకు శానిటరీ ప్యాడ్స్ అందించడం ఈ ఫౌండేషన్ ఉద్దేశం. ప్యాడ్స్ తయారీ యూనిట్లో పని చేసే 15 మంది, వాటిని పంపిణీ చేసే యాభై మంది కూడా స్థానిక బస్తీ మహిళలే. ‘మైనా’ ఉన్న ధారవి బస్తీ ఆసియాలోనే అతి పెద్దది. ఈ ఫెలోషిప్ ప్రాజెక్టుకు 2015లో ‘కాలేజ్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది సుహానీ. ఆ అవార్డుకి ఎంపికైన తొమ్మిది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కో మెంటార్‌ను సూచించింది యూనివర్సిటీ. అలా సుహానీకి మెంటార్‌గా మెర్కెల్ వచ్చిందని అనుకుంటాం. కానీ కాదు! మెర్కెల్ ప్రత్యేక ఆసక్తి ఓ రోజు సుహానీ తన సహవిద్యార్థితోపాటు ఆమె మెంటార్ అయిన మెర్కెల్‌ని కలిసింది సుహానీ. ‘మైనా’ గురించి చెప్పినప్పుడు మెర్కెల్ ఎంతో ఆసక్తి చూపించారు. అలా మెర్కెల్ యు.ఎస్. నుంచి ముంబయి వచ్చారు. మైనా మహిళా ఫౌండేషన్‌లో శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న బస్తీ మహిళలను కలిశారు. వాళ్లకు సూచనలివ్వడంతోపాటు, చేయగలిగినంత సహాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారామె. పెళ్లి ఆహ్వానానికి నాంది ఆ పరిచయమే. పెళ్లికి వచ్చే వాళ్లు వధూవరులకు బహుమతులు ఇవ్వవద్దని, ఆ డబ్బును ఫౌండేషన్లకు విరాళంగా ఇవ్వమని యువరాజు హ్యారీ, మేఘన్ ముందే ఆçహూతులను కోరారు. రాయల్ వెడ్డింగ్‌కి మైనా మహిళా ఫౌండేషన్‌తోపాటు మరో ఆరు చారిటీలకు కూడా ఆహ్వానం అందింది. అవన్నీ స్థానిక బ్రిటిష్ చారిటీలే. ‘‘రాజకుటుంబంలో జరిగే వివాహానికి ఆహ్వానం అందడం ఫెయిరీ టేల్ స్టోరీలాగా ఉందని’’ మైనా మహిళా ఫౌండేషన్ ప్రతినిధి రిషా రోడ్రిగ్స్ పొంగిపోయారు. ఈ పెళ్లికి సుహానీ జలోటాతోపాటు మరో ముగ్గురు ‘మైనా’ మహిళలు కూడా బ్రిటన్‌కి వెళ్లారు. అరుదైన గౌరవం ఇది. -
పారిస్ ఒప్పందానికి కట్టుబడ్డాం
జీ20 సదస్సులో సభ్యదేశాల తీర్మానం హాంబర్గ్: గ్లోబల్ వార్మింగ్‌పై పోరుకు కట్టుబడి ఉన్నామని జీ20 సదస్సులో భారత్ సహా 18 సభ్య దేశాలు స్పష్టం చేశాయి. సదస్సు ముగింపు సందర్భంగా శనివారం అధికారిక ప్రకటనలో ‘పారిస్ వాతావరణ ఒప్పందం అమలులో ఎలాంటి మార్పు ఉండదని, అమెరికా మినహా అన్ని దేశాలు సంపూర్ణ మద్దతు తెలిపాయ’ని చెప్పాయి. పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా ఈ సదస్సులో ఒంటరైంది. జీ20 ముగింపు సమావేశం తర్వాత జర్మనీ అధ్యక్షురాలు మెర్కెల్ మాట్లాడుతూ ‘పారిస్ ఒప్పందంపై అమెరికా తన వ్యతిరేకత కొనసాగించింది. ఇతర సభ్య దేశాలు ఒప్పందానికి గట్టి మద్దతు తెలిపాయ’ని పేర్కొన్నారు. ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు ‘అవినీతిపై పోరుకు కట్టుబడి ఉన్నాం. అందుకోసం పరస్పర సహకారంతో పాటు సాంకేతిక సాయం అందించుకోవాలి. ఐఎంఎఫ్ సంస్కరణల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు, 2019లోగా కొత్త సంస్కరణల్ని రూపొందించాలి. సమాచార, ప్రసార రంగంలో టెక్నాలజీ దుర్వినియోగం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరం. మార్కెట్‌కు నష్టం కలిగించే సబ్సిడీలకు స్వస్తిచెప్పాలి. అలాగే పారిశ్రామిక రంగంలో అధికోత్పత్తి సమస్యను అధిగమించేందుకు అంతర్జాతీయంగా సహకరించుకోవాల’ని జీ20 దేశాలు పిలుపునిచ్చాయి. రక్షణ రంగంలో ఆయుధాల చట్టబద్ధ వ్యాపారానికి జీ20 సదస్సు అంగీకారం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని, స్వేచ్ఛా వాణిజ్య విఫణికి కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. మార్కెట్లలో వివక్ష రూపుమాపాలని, దిగుమతులపై అనవసర పన్నుల్ని తగ్గించాలని, అక్రమ వ్యాపార పద్ధతులకు చెక్ చెప్పాలని జీ 20 దేశాలు నిర్ణయించాయి. కాగా పారిస్ వాతావరణ ఒప్పందంపై సభ్య దేశాలు ఒత్తిడి తేకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాగ్రత్త పడ్డారు. దేశాలకు వారి మార్కెట్లను కాపాడుకునే హక్కు ఉందని జీ20 అధికారిక ప్రకటన స్పష్టం చేయడంతో ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ విధానానికి మార్గం సుగమమైంది. అయితే కర్బన ఇంధనాల్ని పర్యావరణ హితంగా, సమర్థంగా వాడుకునే విషయంలో ఇతర దేశాలతో అమెరికా కలిసి పనిచేయాలని సభ్య దేశాలు అమెరికాకు సూచించాయి. ఉద్యోగుల వలసల్ని ప్రోత్సహించాలి: మోదీ జీ20 సదస్సులో డిజిటలైజేషన్, మహిళా సాధికారత, ఉపాధి అంశంపై మోదీ మాట్లాడుతూ.. ఉద్యోగుల వలసల్ని మరింత ప్రోత్సహించాలని, అందువల్ల ఇరు దేశాలు లాభపడతాయని పేర్కొన్నారు. డిజిటల్ ప్రపంచంతో ఉపాధి అవకాశాలు పెరిగినా.. ముప్పు ఉందని మోదీ చెప్పారు. తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి సాంకేతికతను భారత్ సాధించిందని, మహిళా సాధికారత లేనిదే నిజమైన వృద్ధి సాధ్యం కాదని ప్రధాని పేర్కొన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే చెప్పారు. ట్రంప్ సీట్లో ఇవాంక! జర్మనీలో జరుగుతున్న జీ–20 సమావేశాల్లో కొద్దిసేపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్థానంలో ఆయన కూతురు ఇవాంక కూర్చున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బ్రిటన్ ప్రధాని థెరెసా తదితరుల సరసన ఇవాంక ఆసీనులయ్యారని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తన కుటుంబంలోని వారికి, సన్నిహితులకే కీలక పదవులు కట్టబెడుతున్నారన్న ఆరోపణ ఉండటం తెలిసిందే. -
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి- మోదీ
హన్నోవర్: జర్మనీ హన్నోవర్లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శను ప్రధానమంత్రి మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఏంజెల్ మోర్కెల్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భారతీయ స్టాల్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తయారీ రంగంలో ప్రపంచానికి భారత్ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులపై ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయన్నారు. ఈ సదస్సులో తమ దేశానికి భాగస్వామ్యం కల్పించినందుకు ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాననీ, ఇందుకోసం జర్మనీతోపాటు ప్రపంచదేశాలు ముందుకురావాలని ఆయన కోరారు. నాలుగు వందల భారత కంపెనీలు పాల్గొంటున్న ఈ ప్రదర్శనలో నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు. అయితే కాగా మూడు దేశాల్లో తొమ్మది రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ పర్యటనను ఇప్పటికే ముగించిన ప్రధాని మోదీ జర్మనీలో రెండురోజుల పర్యటన అనంతరం కెనడాకు బయలుదేరి వెళ్ళనున్నారు.