గత ఏడాది ముంబై వచ్చినప్పుడు ‘మైనా’ ప్రతినిధులతో ముచ్చట్లాడుతున్న మేఘన్ మెర్కెల్. ఆమెకు ఎడమవైపున ఉన్నది ‘మైనా’ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా.
మేఘన్ మెర్కెల్! కొత్త పెళ్లి కూతురు. ప్రిన్స్ హ్యారీ భార్య. ఏడాదిగా మెర్కెల్ గురించిన విశేషాలు ధారావాహికగా వచ్చాయి. బ్రిటన్ అంటేనే పెద్ద దేశం. అలాంటి పెద్ద దేశంలో, పెద్దింటికి కోడలిగా వెళ్తున్న అమ్మాయి అంటే సహజంగానే ప్రపంచానికి ఈ ‘సాధారణ యువతి’ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది.
ఎలా ప్రేమలో పడిందీ, పెళ్లి ఎప్పుడు నిశ్చయం అయిందీ అనే విశేషాల నుంచి.. ఆమెకున్న కాలిగ్రఫీ (సొగసైన చేతిరాతలో నైపుణ్యం) హాబీ వరకు మెర్కెల్ గురించి ప్రతిదీ ప్రధానంగా ఆకర్షించే అంశమే అయింది. మొత్తానికి శనివారం మెర్కెల్, హ్యారీల వివాహం ‘నిరాడంబరమైన వైభవం’తో జరిగింది. మన దేశం నుంచి ఒకరిద్దరికి మాత్రమే పెళ్లి పిలుపు అందింది. ఆ ఒకరిద్దరి లో ముంబై మురికివాడల్లో ఉన్న ‘మైనా’ అనే స్వచ్ఛంద మహిళా సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారు!
ఆత్మీయ అతిథిగా ‘మైనా’!
ప్రిన్స్ చార్లెస్ డయానాను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లిని నేరుగా కానీ, టీవీల్లో కానీ కోట్లాది మంది చూశారు. ఇప్పుడు డయానా చిన్న కొడుకు హ్యారీ పెళ్లికి కూడా అంతే ప్రాధాన్యం లభించింది. యువరాజు పెళ్లిని ఇంట్లో పెళ్లిలా ఇష్టంగా చూశారు మన దేశ ప్రజలు. అదేస్థాయిలో ఈ పెళ్లి కోసం ఎదురు చూశారు కూడా.
ముంబయి డబ్బావాలాలైతే.. తమకు తెలిసిన వాళ్లతో మెర్కెల్‌కు పైథానీ చీర, హ్యారీకి కుర్తా, తలపాగాను బహుమతిగా పంపించారు. ఇక విశిష్ట అతిథుల కేటగిరీలో ప్రియాంక చోప్రా పెళ్లికి వెళ్లొచ్చారు. ఆత్మీయమైన అతిథిగా పైన మనం చెప్పుకున్న ‘మైనా’ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా కూడా ఇన్విటేషన్ అందుకున్నారు.
ఆహ్వానం ఎలా వచ్చింది?
గత ఏడాది జనవరిలో మేఘన్ మెర్కెల్ ముంబయికి వచ్చి ధారవీ బస్తీ మహిళలతో, ‘మైనా’ ప్రతినిధులతో కలివిడిగా కూర్చుని కబుర్లాడి వెళ్లారు. ‘మైనా’ ప్రత్యేక ఆహ్వానంపై ముంబై వచ్చిన మెర్కెల్.. స్త్రీ సాధికారత దిశగా పనిచేస్తున్న ఈ మహిళల నుంచి స్ఫూర్తి పొందారు. రాయల్ వెడ్డింగ్‌కి ‘మైనా’ ప్రతినిధులకు ఆహ్వానం అందడానికి ఇదే ప్రధాన కారణం. యువరాజు పెళ్లికి ఆహ్వానం అందుకున్న ఏడు విదేశీ ఎన్జీవోలలో మన ‘మైనా’ ఒకటి.
మెర్కెల్ ఇండియాకి రావడానికి కారణం 23 ఏళ్ల సుహానీ జలోటా. సుహానీ యు.ఎస్.లోని డ్యూక్ యూనివర్సిటీ స్టూడెంట్. చురుకైన విద్యార్థి. ఎంటర్‌ప్రెన్యూరియల్ ఫెలోషిప్‌లో భాగంగా ముంబైలో ‘మైనా మహిళా ఫౌండేషన్’ ప్రారంభించింది. రుతుక్రమ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పట్ల మహిళలకు అవగాహన కల్పించడం, పేద మహిళలకు తక్కువ ధరకు శానిటరీ ప్యాడ్స్ అందించడం ఈ ఫౌండేషన్ ఉద్దేశం.
ప్యాడ్స్ తయారీ యూనిట్‌లో పని చేసే 15 మంది, వాటిని పంపిణీ చేసే యాభై మంది కూడా స్థానిక బస్తీ మహిళలే. ‘మైనా’ ఉన్న ధారవి బస్తీ ఆసియాలోనే అతి పెద్దది. ఈ ఫెలోషిప్ ప్రాజెక్టుకు 2015లో ‘కాలేజ్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది సుహానీ. ఆ అవార్డుకి ఎంపికైన తొమ్మిది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కో మెంటార్‌ను సూచించింది యూనివర్సిటీ. అలా సుహానీకి మెంటార్‌గా మెర్కెల్ వచ్చిందని అనుకుంటాం. కానీ కాదు!
మెర్కెల్ ప్రత్యేక ఆసక్తి
ఓ రోజు సుహానీ తన సహవిద్యార్థితోపాటు ఆమె మెంటార్ అయిన మెర్కెల్‌ని కలిసింది సుహానీ. ‘మైనా’ గురించి చెప్పినప్పుడు మెర్కెల్ ఎంతో ఆసక్తి చూపించారు. అలా మెర్కెల్ యు.ఎస్. నుంచి ముంబయి వచ్చారు. మైనా మహిళా ఫౌండేషన్‌లో శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న బస్తీ మహిళలను కలిశారు. వాళ్లకు సూచనలివ్వడంతోపాటు, చేయగలిగినంత సహాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారామె. పెళ్లి ఆహ్వానానికి నాంది ఆ పరిచయమే.
పెళ్లికి వచ్చే వాళ్లు వధూవరులకు బహుమతులు ఇవ్వవద్దని, ఆ డబ్బును ఫౌండేషన్‌లకు విరాళంగా ఇవ్వమని యువరాజు హ్యారీ, మేఘన్ ముందే ఆçహూతులను కోరారు. రాయల్ వెడ్డింగ్‌కి మైనా మహిళా ఫౌండేషన్‌తోపాటు మరో ఆరు చారిటీలకు కూడా ఆహ్వానం అందింది. అవన్నీ స్థానిక బ్రిటిష్ చారిటీలే. ‘‘రాజకుటుంబంలో జరిగే వివాహానికి ఆహ్వానం అందడం ఫెయిరీ టేల్ స్టోరీలాగా ఉందని’’ మైనా మహిళా ఫౌండేషన్ ప్రతినిధి రిషా రోడ్రిగ్స్ పొంగిపోయారు. ఈ పెళ్లికి సుహానీ జలోటాతోపాటు మరో ముగ్గురు ‘మైనా’ మహిళలు కూడా బ్రిటన్‌కి వెళ్లారు. అరుదైన గౌరవం ఇది.
Comments
Please login to add a commentAdd a comment