సందేశాత్మకం..ఆ‘నంది’ ఉత్సవం
- సమకాలీన సమస్యలకు అద్దం పట్టిన నాటకాలు
- రెండో రోజు నాలుగు నాటక ప్రదర్శనలు
కర్నూలు (కల్చరల్): రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం.. సందేశాత్మక నాటకాలను ప్రదర్శించారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నాటక ప్రదర్శనలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై మనుషుల మధ్య మమతానురాగాలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రదర్శించిన నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గురువారం ఉదయం మంచ్ థియేటర్ హైదరాబాద్ నాటక సమాజం వారు ప్రదర్శించిన ‘చాయ్ ఏది బే’ నాటకం తెలంగాణ మాండలికంలో సాగింది. ఒక కుటుంబ సమస్య ఊరి సమస్యగా మారినప్పుడు..అందరికీ అనుకూలుడైన చాయ్‌వాలా దానికి పరిష్కారం చూపడమే ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. శ్రీకాంత్ బాణాల రచించి దర్శకత్వం వహించిన ఈ నాటకంలో సంభాషణలు ప్రేక్షకులను ఉత్తేజపరిచాయి. మీ కోసం... హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన ‘ఫోమో’ సాంఘిక నాటకం ఆధునిక తరం, ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు ఉపయోగిస్తూ మానవీయ సంబంధాలను ఎలా మంటగలుపుతుందో తెలియజేస్తుంది. డా.శ్రీనివాసరావు రచించిన ఈ నాటకానికి ఎంఎస్కే ప్రభు దర్శకత్వం వహించారు.
కుటుంబ ప్రాధాన్యం తెలిపిన ‘ఈ లెక్క.. ఇంతే’
చైతన్య కళా భారతి కరీంనగర్ నాటక సమాజం ప్రదర్శించిన ఈ లెక్క ఇంతే నాటిక కుటుంబవ్యవస్థ మరింత పటిష్టంగా ఏర్పాడాలనే ఆవశ్యకతను తెలియజేస్తుంది. కుటుంబాలు బాగుంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందనే సందేశాన్ని అందించింది. కుటుంబంలోని వారు బలహీనతలకు బానిసై బాధ్యతారాహిత్యంగా మారితే ఆ కుటుంబం అస్తవ్యస్తమవుతుందని ఈ నాటిక సందేశం అందించింది. మంచాల రమేష్ రచించిన ఈ నాటకానికి పరమాత్మ దర్శకత్వం వహించారు.
సందేశాత్మక నాటిక ‘జారుడు మెట్లు’
కళాంజలి హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన జారుడు మెట్లు నాటకం చక్కని సామాజిక సందేశాన్ని అందించింది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పాలకులు ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చి తమ పబ్బం గడుపుకుంటున్న తీరు తెన్నులకు ఈ నాటిక దర్పణం పట్టింది. నాయకులు అనునిత్యం బంధుప్రీతితో, స్వార్థంతో తన సొంతానికి, తన వాళ్లకు సేవ చేసుకోవడం తప్ప ప్రజలకు ప్రయోజనకరమయ్యే పనులు చేపట్టకపోవడంతో ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతుందని ఈ నాటిక దృశ్య రూపంలో తెలియజేసింది. కంచర్ల సూర్యప్రకాష్ రచించిన ఈ నాటకానికి కొల్ల రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.
రెండు నాటక ప్రదర్శనలు రద్దు
నంది నాటకోత్సవాలల్లో భాగంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8.30 గంటల వరకు ఆరు నాటకాలు ప్రదర్శించ వలసి ఉంది. అయితే పాప్‌కార్న్ థియేటర్ వారి దావత్ నాటిక, స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ వారు హిమం నాటికలు రద్దు అయ్యాయి. ఈ నాటక సమాజాల కళాకారులు ప్రదర్శన కోసం రాకపోవడంతో ఈ రెండు నాటికలు రద్దు అయ్యాయని ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులకు భోజన ఏర్పాట్లు కల్పించినట్లు నాటకోత్సవాల కన్వీనర్ ఆర్డీఓ రఘుబాబు, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు.