మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించిన మెస్సెంజర్లు
మోర్తాడ్ : సర్వశిక్ష అభియాన్ పథకం కింద మెస్సెంజర్లుగా పనిచేస్తున్న వారిని కొనసాగించకుండా జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని మెస్సెంజర్లు ఆశ్రయించారు. ఈమేరకు మెస్సెంజర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డప్పు దిలీప్ గురువారం మాట్లాడారు. సర్వశిక్ష అభియాన్ పథకం కింద దాదాపు 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమను ఏడాదికి ఒకసారి కాంట్రాక్టు రెన్యూవల్ చేస్తారని తెలిపారు. ఈ ఏడాది కూడా రెన్యూవల్ చేయాల్సి ఉన్నా జిల్లా అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సర్వశిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి కాంట్రాక్టును రెన్యూవల్ చేయాలని ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపారు. అయితే జిల్లాలో మాత్రం కాంట్రాక్టు రెన్యూవల్ చేయకపోగా బీఈడీ, డీఈడీ సర్టిఫికెట్లు పొందిన అభ్యర్థులను రెన్యూవల్ చేయాలని అధికారులు నిర్ణయించారని తెలిపారు. అధికారుల నిర్ణయం వల్ల జిల్లాలోని 36 మంది మెస్సెంజర్లు రోడ్డునపడాల్సి వస్తుందని వాపోయారు. ఏళ్ల తరబడి మెస్సెంజర్లుగా పనిచేసిన వారిని తొలగించడం వల్ల కుటుంబాలకు ఆధారం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల సంఘంలో జిల్లా అధికారులపై ఫిర్యాదు చేయగా ఈనెల 22న హియరింగ్ తేదీ ఇచ్చారని తెలిపారు. మానవహక్కుల సంఘంలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని దిలీప్ ఆశాభావం వ్యక్తం చేశారు.