పోలీసుల తీరు బాధాకరం
అనంతపురం సెంట్రల్ : కనగానపల్లి మండలం బద్దలాపురంలో ఈనెల 2న జరిగిన ఘర్షణ æవిషయంలో అదుపులోకి తీసుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్త నల్లపరెడ్డిని నేటికీ అజ్ఞాతంలో ఉంచడం బాధాకరమని వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ కన్వీనర్ నారాయణరెడ్డి, రాప్తాడు జెడ్పీటీసీ, అడ్వొకేట్ వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ రాజశేఖరబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఈనెల 2న దివంగత సీఎం వైఎస్ వర్ధంతి సందర్భంగా బద్దలాపురంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారన్నారు.
ఈ ఘటనపై ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అదే రోజు వైఎస్సార్సీపీ కార్యకర్త నల్లపరెడ్డి, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇంత వరకూ వారిని అరెస్ట్ చూపించడం కానీ ఇళ్లకు పంపడం గానీ చేయలేదన్నారు. చట్ట ప్రకారం కస్డడీలోకి తీసుకున్న 24 గంటల్లోపే అరెస్ట్ చూపించాలన్నారు. కేవలం మంత్రి పరిటాల సునీత ఒత్తిడి మేరకే వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా కారయదర్శి విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.