Metro Water Board
-
‘సాగర్’లో కనీస నీటి మట్టం కష్టమే
⇒ పంపులు దించి నీటిని తోడాల్సిందే ⇒ మెట్రో వాటర్ బోర్డుకు నీటిపారుదలశాఖ స్పష్టం సాక్షి, హైదరాబాద్: రాజధాని తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఈ ఏడాది సైతం కనీస నీటి మట్టాలను నిర్వహించడం సాధ్యం కాదని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండ బ్ల్యూఎస్ఎస్బీ)కు నీటిపారుదల శాఖ తేల్చి చెప్పింది. శ్రీశైలం, సాగర్‌లో నెలకొన్న నీటి కొరత, మున్ముందు ఉన్న రబీ సాగు, తాగు అవసరాల దృష్ట్యా, కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కనీస నీటి మట్టాలకు దిగువ నుంచి నీటిని తోడేలా పంపులను దించాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. 824 అడుగులకు చేరిన శ్రీశైలం ఈ ఏడాది ఎగువన శ్రీశైలం నుంచే అధిక నీటి వినియోగం జరగడంతో సాగర్‌కు అనుకున్న స్థాయిలో నీటి విడుదల కాని విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం సాగర్‌లో నీటినిల్వ.. 590 అడుగులకు గానూ 514 అడుగులకు చేరింది. ఈ మట్టంలో ప్రస్తుతం 138 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నా, కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన 7 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంది. ఇప్పటికే శ్రీశైలం కనీస నీటి మట్టం దిగువకు వెళ్లి ఇరు రాష్ట్రాలు నీటిని తోడేసుకుంటున్నాయి. ఇక్కడ కనీస నీటిమట్టం 834 అడుగులైతే ఇప్పటికే అది 824 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో సాగర్‌లో ఉన్న లభ్యత నీటినే సాగు, తాగు అవసరాలకు వాడాల్సి ఉంది. ఇందులో సాగర్ కింద సాగు చేసిన రబీల పంటలకు కొన్ని విడతల్లో నీటి సరఫరా జరగ్గా, మరింత నీటిని సరఫరా చేయాల్సి ఉంది. హైదరాబాద్‌కు 8 టీఎంసీలు అవసరం హైదరాబాద్ అవసరాలకు నెలకు 1.8 టీఎంసీల చొప్పున సాగర్ నుంచే విడుదల చేయాల్సి ఉంది. జూన్‌లో వర్షాలు కురిసి ప్రవాహాలు మొదలయ్యే వరకు తాగునీటికి 8 టీఎంసీలైనా అవసరం ఉంటుంది. ప్రస్తుతం కనీస నీటి మట్టానికి ఎగువన ఉన్న నీటితో ఈ అవసరాలను తీర్చడం సాధ్యం కానందు న కచ్చితంగా కనీస నీటి మట్టాలకు దిగువ నుంచి నీటిని తీసుకోవాల్సిందే. కిందటేడాది సైతం ఇదే రీతిన 503 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకున్నారు. ఈ ఏడాది సైతం అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కనీస నీటి మట్టాలను నిర్వహిం చాలన్న హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వినతిని నీటిపారుదలశాఖ తోసిపుచ్చింది. ప్రస్తుతం ఉన్న నీటిని జూన్ వరకు కాపాడటం కష్టతర మని, ఈ దృష్ట్యా వేసవి కాలానికి ముందు గానే పంపులను కిందికి దించే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. -
దండుకో...
కొలువుల భర్తీలో అవినీతి జాతర అక్రమాలకు తెరలేపిన జలమండలి అధికారులు బోగస్ పత్రాలతో రెచ్చిపోతున్న అభ్యర్థులు మరోవైపు దళారుల ప్రవేశం ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల చొప్పున వసూలు 80 పోస్టులకు చేతులు మారనున్న రూ.4 కోట్లు! సాక్షాత్తు సీఎం చైర్మన్‌గా ఉన్నా ఆగని అవినీతి దందా సాక్షి, సిటీబ్యూరో: జలమండలి పోస్టుల భర్తీ ప్రక్రియ అవినీతి పుట్టగా మారింది. పోస్టులు చిన్నవే అయినా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మెట్రో వాటర్ బోర్డులోనే భారీ అవినీతికి తెరలేసింది. 80 పోస్టులకు గాను వేలాది మంది దరఖాస్తు చేసుకోగా కొందరు దొడ్డిదారిన ఉద్యోగాన్ని సంపాదించే పనిలో పడ్డారు. అనుభవం ఉన్నట్టు బోగస్ ధ్రువపత్రాలను సమర్పించారు. బోగస్ ధ్రువపత్రాలు జారీ చేసింది బోర్డు అధికారులే కావడం గమనార్హం. ఇదిలావుంటే దళారులు సైతం రంగ ప్రవేశం చేశారు. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఈ లెక్కన రూ.4 కోట్ల మేర చేతులు మారినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తరవాత నగరంలో జరుగుతోన్న తొలి భర్తీ ప్రక్రియలో అవినీతి చోటుచేసుకోవడం నిరుద్యోగులను విస్మయానికి గురిచేస్తోంది. విజిలెన్స్ విచారణతో అక్రమార్కుల నిగ్గు తేల్చాలని కార్మిక సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. జలమండలిలో జనరల్ పర్పస్ ఎంప్లాయ్ (వాటర్ సప్లై అండ్ సీవరేజీ) పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు 658 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే వాటర్ బోర్డులో ఎన్ఎంఆర్, హెచ్ఆర్ కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 578 మంది సర్వీసులను క్రమబద్ధీకరించనున్నారు. అయితే మిగిలిన 80 పోస్టులకు గాను నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 80 పోస్టులకు గాను సుమారు 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు టెన్త్, బీసీ, జనరల్ అభ్యర్థులకు ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా సుమారు 2,500 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. వీరికి ఇటీవల క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించారు. కాగా భర్తీ ప్రక్రియలో అనుభవం ఉన్నవారికి వెయిటేజీ ప్రకటించడంతో వందలాది మంది అభ్యర్థులు అనుభవం ఉన్నట్టు బోగస్ పత్రాలు సమర్పించారు. బోర్డులో పనిచేసే క్షేత్రస్థాయి అధికారుల నుంచి తీసుకున్న ఈ పత్రాలను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించినట్టు ఇటీవల ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. సదరు అనుభవ ధ్రువీకరణ పత్రం సరైనదేనా కాదా? అని తేల్చే అంశం ఉన్నతాధికారులకు తలకుమించిన భారంగా మారింది. భర్తీ ప్రక్రియ సమయంలో బోగస్ పత్రాలను గుర్తించడం కష్టమనే విషయాన్ని అధికారులు చెబుతుండడంతో మిగతా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షలు వసూలు? బయటి వ్యక్తుల ద్వారా 80 పోస్టులను భర్తీ చేయాల్సి రావడంతో దళారులు రంగంలోకి దిగారు. నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఈ లెక్కన సుమారు రూ.4 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉంది. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు యూనియన్ నేతలు సైతం తమ పలుకుబడిని, అధికారాన్ని ఉపయోగించుకొని ఈ వ్యవహారంలో తలదూర్చి చేతివాటాన్ని ప్రద ర్శిస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నీటి సరఫరా పోస్టుకే మొగ్గు.. ఇందులో జీపీఈ(నీటి సరఫరా)పోస్టు వైపే పలువురు అభ్యర్థులు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. పైసంపాదన అధికం.. శ్రమ తక్కువగా ఉండడం వల్లే పలువురు అభ్యర్థులు ఈ పోస్టు దక్కించుకునేందుకు ఖర్చుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది. ఇక జీపీఈ(సీవరేజి) కి సంబంధించిన పోస్టులు 30 వరకు ఉన్నాయి. మ్యాన్‌హోళ్లలోకి దిగి మురుగును తొలగించా ల్సి ఉంటుంది. ఇలాంటి పనులు చేపట్టాల్సి ఉన్నందున సీవరేజి పోస్టులోకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. విజిలెన్స్ విచారణకు డిమాండ్.. భర్తీ ప్రక్రియలో భాగంగా కొందరు అభ్యర్థులు బోగస్ అనుభవ పత్రాలు సమర్పించినట్టు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరపాలని పలు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుల నియామకంలో పారదర్శకత కరువైందని, బయటి అభ్యర్థులు సమర్పించిన విద్యార్హత, అనుభవ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే పోస్టింగ్‌లు ఇవ్వాలన్నారు. బోగస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 200 మంది బోగస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు ప్రాథమికంగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈనెలాఖరులోగా భర్తీ ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో బోగస్ వ్యవహారాన్ని బోర్డు యాజమాన్యం సీరియస్‌గా తీసుకోవాలని వారు కోరుతున్నారు.