నిధులు పెంచండి...
14వ ఆర్థిక సంఘం కమిటీ చైర్మన్‌కు బాలునాయక్ విజ్ఞప్తి
నీలగిరి : స్థానిక సంస్థల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు పెంచాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ 14వ ఆర్థిక సంఘం కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.హైదరాబాద్‌లో శుక్రవారం 14వ ఆర్థిక సంఘం కమిటీ సమావేశం జరిగింది. దీనికి జిల్లా నుంచి బాలునాయక్ హాజరయ్యారు. రాబోయే ఐదేళ్ల కాలంలో కేంద్ర నుంచి విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధుల విషయంలో కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా జిల్లా తరఫున సమావేశానికి హాజరైన జెడ్పీ చైర్మన్ పలుసమస్యలతో కూడిన వినతిపత్రాన్ని 14వ ఆర్థిక సంఘం కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డికి అందజేశారు. ప్రధానంగా ఫ్లోరైడ్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.
ఇవీ.. మన జెడ్పీ ప్రతిపాదనలు
► ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు రూ.40 కోట్లు నిధులు మంజూరవుతున్నాయి. వీటిని రూ.65 కోట్లకు పెంచాలి.
► గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఖర్చు చేస్తున్న నిధుల వ్యయాన్ని కూడా పెంచాలి.
► ప్రస్తుతం చేతి పంపుల ద్వారా సరఫరా అయ్యే నీటికి ఒక వ్యక్తికి రూ.6 ఖర్చు చేస్తున్నారు. దీనిని జనాభా ప్రాతిపదికన రూ.12లకు పెంచాలి.
► గ్రామాల్లో పైపులైన్ల ద్వారా నల్లాలకు సరఫరా చేసే నీటికి ఒక వ్యక్తికి రూ.30 ఖర్చు చేస్తున్నారు. దీనిని రూ.64లకు పెంచాలి.
► కృష్ణా జలాలు సరఫరా చేసేందుకు ఒక వ్యక్తికి రూ.65 ఖర్చు చేస్తున్నారు. దీనిని రూ.135లకు పెంచాలి.
► స్థానిక సంస్థల నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
► మెట్రోవాటర్ సెస్, విద్యుత్ బిల్లులో 30 శాతం సబ్సిడీ ఇవ్వాలి.