ఈ సీజనంతా రాష్ట్రం నిప్పుల కొలిమే
ఏప్రిల్‌లో ఇంతటి ఎండలు 1973 తర్వాత ఇదే ప్రథమం
మేలో ఉండే ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్న వైనం
మేడారంలో 45 డిగ్రీలు... హైదరాబాద్‌లో 43.11
అన్నిచోట్లా 40-44 డిగ్రీలతో ఠారెత్తిస్తున్న భానుడు
ఈ సీజన్లో ఇప్పటికే 47 డిగ్రీలనూ దాటేసిన ఎండలు
వచ్చే రెణ్నెల్లు 45-50 డిగ్రీలు: వాతావరణ శాఖ
ఏకంగా 40 రోజుల పాటు వడగాడ్పులు!
వడగాడ్పులకు ఇప్పటికే 75 మంది బలి
సాక్షి, హైదరాబాద్: అటు మండే ఎండలు, ఇటు తాళలేని వడగాడ్పులు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. సాధారణంగా మే నెలలో నమోదయ్యేంతటి తీవ్ర ఉష్ణోగ్రతలు ఈసారి ఏప్రిల్‌లోనే రికార్డవుతుండటంతో జనం ఠారెత్తిపోతున్నారు. ఉదయం 10 దాటాక బయటికి రావాలంటేనే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సి వస్తోంది. 1973 తర్వాత ఏప్రిల్‌లో ఇంతటి ఎండలు కాయడం ఇదే ప్రథమమని భారత వాతావరణ శాఖ చెబుతోంది. 1973 ఏప్రిల్ 30న 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, ఈ ఏడాది మాత్రం మార్చిలోనే (24న) కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో ఏకంగా 47.33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది!
ఏప్రిల్ తొలి వారంలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో 46.08 డిగ్రీలు, దండేపల్లిలో 45.05, వాంకిడిలో 45.08 డిగ్రీలు నమోదైనట్టు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం వెల్లడించింది. అంతేకాదు, కనీవినీ ఎరుగని విధంగా ఈసారి మార్చిలోనే సగటున ఏకంగా 40-44 డిగ్రీలతో రాష్ట్రాన్ని ఎండలు అక్షరాలా మంటెత్తించాయి. ఇక ఏప్రిల్లోనయితే ఎండల తీవ్రత మరీ పెరుగుతోంది. గురువారం వరంగల్ జిల్లా మేడారంలో 45.06 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది! హైదరాబాద్‌లో 43.11, మిర్యాలగూడలో 44.04 డిగ్రీలు, పలుచోట్ల 43 డిగ్రీలు నమోదైంది. ఎండలకు తోడు వడగాడ్పులు కూడా తీవ్రస్థాయికి చేరాయి. దాంతో జనం వడదెబ్బ బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలా ఈ సీజన్లో ఇప్పటికే ఏకంగా 75 మంది మృతి చెందారు!
వామ్మో వడగాడ్పులు
సాధారణంగా ఏటా వేసవిలో వడగాడ్పులు సరాసరి 10-15 రోజులు మాత్రమే ఉంటాయన్నది వాతావరణశాఖ లెక్క. ఈసారి మాత్రం ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండటంతో వడగాడ్పులు దాదాపు 40 రోజులకు మించి ఉంటాయంటున్నారు! ఉష్ణోగ్రత సాధారణం కంటే ఐదు డిగ్రీలకు మించి ఉంటే వడగాడ్పులుగా పరిగణిస్తారు. అలా చూస్తే ఈ వేసవి మొత్తం రాష్ట్రం దాదాపు వడగాడ్పుల గుప్పిట్లోనే ఉండేలా కన్పిస్తోంది. నిజామాబాద్, రామగుండం, ఖమ్మంలలో వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు. మిగతా చోట్ల కూడా పరిస్థితి వాతావరణ శాఖ అంచనాలకు మించి తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా పిల్లలు ఎండలబారిన పడకుండా చూసేందుకు జిల్లా స్థాయిలో యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక కాగితాలకే పరిమితమైందన్న విమర్శలున్నాయి.
వచ్చే రెండు నెలలపాటు రాష్ట్రంలో 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో ఉదయం 11-సాయంత్రం 4 గంటల మధ్య బయటికి అడుగు పెట్టకపోవడమే మేలని నిపుణులంటున్నారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల దెబ్బకు రాష్ట్రంలో రేడియేషన్ ప్రభావం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయం 11-మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ ప్రభావం అధికంగా ఉంది. సాధారణం కంటే రాష్ట్రంలో అనేకచోట్ల పదింతలకు పైగానే రేడియేషన్ నమోదవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చర్మ సమస్యలకు దారితీయడమేగాక కిడ్నీలపైనా దుష్ర్పభావం చూపుతుందని చెబుతున్నారు.
మండే ఎండల్లోనూ స్కూళ్లా?
ఓవైపు ఎండలు పెద్దవాళ్లను కూడా ఠారెత్తిస్తున్నా రాష్ట్రంలో స్కూళ్లు మాత్రం ఇంకా పని చేస్తూనే ఉన్నాయి. పిల్లలు మాత్రం మండే ఎండల్లోనే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. వార్షిక పరీక్షలు పూర్తయినా ప్రభుత్వాదేశం మేరకు వచ్చే విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టి పై తరగతులు నడిపిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ క్లాసులు జరుగుతుండటంతో మిట్టమధ్యాహ్నం వేళ మండే ఎండల్లో పిల్లలు ఇళ్లకు రావాల్సి వస్తోంది.
వడదెబ్బతో 27 మంది మృతి
తెలంగాణలో గురువారం వడదెబ్బతో 27 మంది మృతి చెందారు. వరంగల్ జిల్లాలో పదిమంది, నల్లగొండ జిల్లాలో నలుగురు, మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఇద్దరు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, నిజామాబాద్‌లో ఒకరు వడదెబ్బతో మృతిచెందారు.