సాహిత్యంలో క్రయిమూ, వేదాంతమూ!
బహుళ అస్తిత్వాలని రద్దు పరచి, ఒకే ఆధునిక మూసలోకి ఇమిడ్చేయాలని చూసే శిష్ట వర్గమే ఇంటలెక్చువల్ క్రిమినల్స్. వీళ్లు బ్రిటిష్ వలసవాద మేధావుల వారసులు. ‘ముద్దుపళని’ కవిత్వాన్ని నిషేధించిన పెద్దమనుషుల మానసపుత్రులు. ఎం.ఎఫ్.హుస్సేన్ లాంటి కళాకారుని దేశ బహిష్కరణ చేయడానికి పరోక్ష కారణం వీళ్లే. వీళ్లు అండర్‌వరల్డ్ కన్నడ మేధావి అగ్ని శ్రీధర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి.
మనిషి జీవితంలో రాగద్వేషాలు చాలా ప్రధానమైనవి. చలం రాగాన్ని (సెక్సు) మథిస్తే, అగ్ని శ్రీధర్ ద్వేషాన్ని (క్రైమ్) మథించిన సత్యాన్వేషకుడు. ‘‘క్రిమినల్సూ, ప్రొఫెషనల్ కిల్లర్సూ కూడా మన లాంటి మనుషులేననే అవగాహనని కలిగించింది తెగింపు నవల’’ అంది మా అమ్మాయి జ్యోతి. అన్నిటికన్నా పెద్ద నేరం నేరస్థుల పట్ల ఫెలో ఫీలింగ్ లేకపోవడమే. మనకీ క్రిమినల్సుకీ తేడా పర్సంటేజిలోనే. ‘తెగింపు’లో చంపే వ్యక్తి, చంపబడే వ్యక్తి ఎదురుగా కూర్చొని గుండె తలుపులు తెరుచుకునే తీరు విశిష్టమైనది. కృష్ణార్జునుల సంభాషణ కన్నా గొప్పది.
ఇటీవల భగవద్గీత హింసను బోధిస్తోందని ప్రకటించిన అగ్ని శ్రీధర్ మాజీ అండర్ వరల్డ్ డాన్. ‘లా’ చదివి, కలాం చెప్పినట్లు సివిల్ సర్వీసు కూడా పూర్తిచేసి ఉన్నత స్థానానికి ఎదగాలని కలగన్నవాడే! కానీ, ఒక యాదృచ్ఛిక ఘటన జీవితాన్ని మార్చేసింది. పొరపాటున ఆయన సోదరుడిపై క్రిమినల్సు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రతీకారం కోసం క్రిమినల్‌గా మారాడు శ్రీధర్. ‘జైలు జీవితం క్రిమినల్స్నీ పోలీసులనీ కూడా స్పందన రహితులని చేస్తుంది. అందుకే జైళ్లలో మత్తుమందులు నివారించడం అసాధ్యం’ అంటాడు.
చల్లని బెంగళూరు నగరం అడుగున అండర్ వరల్డ్ క్రైమ్ చాలా కాలంగా మరుగుతూనే ఉంది. 19వ శతాబ్దంలో బ్రాహ్మణులు బ్రిటిష్ ఉద్యోగస్వామ్యంలోకి అడుగుపెట్టారు. తరవాత ఇతర కులాలవారు కూడా ఆధునికతలో వాటా కోసం డిమాండ్ చేస్తూ వచ్చారు. వాటా దొరకనివాళ్లు సహజంగానే హింసని ఆశ్రయిస్తారు. దేవరాజ్ అర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలహీన వర్గాలకి రాజకీయాలలో స్థానం కల్పించాడు, భూ సంస్కరణలు ప్రారంభించాడు. ఆయనకీ, ఆయన అల్లుడు ఎం.డి.నటరాజుకీ అండర్ వరల్డ్ డాన్ జయరాజుతో సంబంధాలు ఉండేవి. జయరాజు సోషలిస్టు భావాలు కలవాడు. ‘గరీబీ హఠావో’ పత్రికను నడిపేవాడు. ఈయన అనుచరుడు అగ్ని శ్రీధర్.
రాజకీయ నాయకులకీ, సినిమావాళ్లకీ అండర్ వరల్డ్‌తో సంబంధాలు సాధారణమే. బెంగళూరు క్రిమినల్ ప్రపంచం వెనుక కులం పాత్ర కూడా ఉందా? అవునంటాడు శ్రీధర్. ‘‘మన ప్రపంచంలో రెండే కులాలు ఉన్నాయి - పోలీసులూ, నేరస్థులూ’’. లంకేష్ రచనల ప్రభావం నిన్ను చెడగొడుతోంది అంటాడు జయరాజు. కన్నడ రచయిత లంకేష్ (రాళ్లు కరిగేవేళ)తో శ్రీధర్ అనుబంధం విచిత్రమైనది. లంకేష్ తన పత్రికలో శ్రీధర్ని ఒకసారి ‘రౌడి’ అని నిందించాడు. కానీ, ఒకప్పుడు లంకేష్ కూతురూ, భార్యలకి రౌడీల బెడద ఎదురైనప్పుడు శ్రీధర్ రౌడీయిజమే శ్రీరామరక్ష అయ్యింది.
బెంగళూరు క్రైమ్ ప్రపంచంలోకి కత్తులు కటారులు పోయి గన్నులు ప్రవేశించింది 1990లో. పోలీసులు తమకి బెడదగా మారిన జయరాజుని అతని ప్రత్యర్థి సహాయంతో చంపించేస్తారు. గన్నులు, డబ్బుల ప్రవాహం ఒకేసారి పెరిగాయి. బొంబాయి మాఫియాతో బెంగళూరు హనీమూన్ మొదలైంది. ప్రతీకారం కాదు, ఆధిపత్యం కాదు, ఏ కారణం లేకుండా కేవలం డబ్బుకోసం చంపేసే ముంబాయి కిల్లర్స్ ఇంపోర్టు అయ్యారు. అండర్ వరల్డ్‌లో గ్లోబలైజేషన్ ఇది. ఇటువంటి ప్రొఫెషనల్ కిల్లర్ అంతర్మథనమే ‘తెగింపు’.
శ్రీధర్ జీవితం పవిత్రమైనది కాదు. అవసరానికి డబ్బు బ్రోతల్ హౌసుల నుంచి వసూలు చేసుకోమంటాడు జయరాజు. నైతిక చింతనలో పడతాడు శ్రీధర్. ‘నువ్వు కాకపోతే అక్కడ మరొకరు లీడు తీసుకుంటారు’ అని సమాధానం చెప్తాడు జయరాజు. కానీ, స్త్రీల పట్ల శ్రీధర్ గౌరవం ఎనలేనిది. తనకి అత్యంత ప్రీతిపాత్రుడైన ‘హాయ్ బెంగళూర్’ ఎడిటర్ రవితో సంబంధం తెంచుకొని ‘అగ్ని’ వారపత్రిక స్థాపించడానికి ముఖ్య కారణాలలో అదొకటి. రవి సెక్సు వర్కర్సుపై సెన్సేషనల్ కథనాలు రాయడమేగాక వారిపై పోలీసు హింసకు కారణమయ్యాడనేది శ్రీధర్ అభియోగం.
భగవద్గీతలోనే కాదు, వీరశైవ మతప్రవక్త బసవేశ్వరుని వచనాల్లో కూడా స్త్రీలని అవమానించే భావాలున్నాయని వాటిని ఖండించాలంటాడు. గనుల మాఫియాని, ఆధ్యాత్మిక మాఫియాని కూడా జర్నలిస్టుగా, యాక్టివిస్టుగా ఎదుర్కొన్నాడు. అగ్ని శ్రీధర్ క్రిమినల్, తాత్వికుడు, రచయిత, సినిమా కళాకారుడు, యాక్టివిస్ట్. అతని ప్రస్థానం విస్తృతమైనది. రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి, బౌద్ధాన్ని స్వీకరించిన అంగుళీమాలుడు, కళింగయుద్ధం చేసిన అశోక చక్రవర్తి కూడా క్రిమినల్ ప్రపంచం నుంచి వచ్చినవారే. నాగరికులు కావడం కోసం ఇంద్రియాలని తీవ్ర అణచివేతకి గురిచేయమని చెప్పిన బుద్ధుడు, వర్ధమాన మహావీరుడూ కూడా ఆత్మహింసని పురికొల్పిన క్రిమినల్సే. దీన్నే గాంధీ రాజకీయంగా మార్చాడు. మానవ చరిత్రలో క్రియేటివిటీ, క్రైమూ విడదీయరానంతగా కలగలిసిపోయుంటాయి.
‘మనిషికి సంఘటనలని రికార్డు చేసే శక్తే లేకపోతే, మంచి చెడులు అనేవి ఉండేవే కావు. చెదురు మదురు సంఘటనలుగా మిగిలిపోయేవి’ అంటాడు శ్రీధర్. ‘సర్వ క్షణికం’ అనే బౌద్ధం కూడా ‘ఒకడిని ప్రత్యేకంగా దోషి అని నిర్ధారించడం ఎలా?’ అనే ప్రశ్నని ఎదుర్కొంది (మిళింద పన్హా). ఐతే మంచి చెడులు అనేవే లేవా? అంతా పరిస్థితుల ప్రభావమేనా? - కాదు కాదు. మనిషి స్వేచ్ఛా శాపగ్రస్తుడని, నైతిక బాధ్యత నుంచి తప్పించుకోలేడనే అస్తిత్వవాదాన్నే బలపరుస్తాడు శ్రీధర్.
‘సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్న మిమ్మల్ని శ్రీధర్ ఎలా ఆకర్షించాడు?’ అని ప్రశ్నించాడు సృజన్(తెగింపు అనువాదకుడు). అధోజగత్తుని అధ్యయనం చేయనిదే ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థని అర్థం చేసుకోవడం అసాధ్యం!
- అగ్ని శ్రీధర్
- రాణి శివశంకరశర్మ
7396666942