MGP
-
బీజేపీకి ఎదురుదెబ్బ
పణజి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోవాలో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ) కొత్త కూటమి ఏర్పాటు చేసింది. శివసేన, గో సురక్ష మంచ్(జీఎస్ఎం)తో కలిసి కూటమిగా ఏర్పడింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలికట్టుగా పోటీ చేస్తామని మూడు పార్టీలు ప్రకటించాయి. ఈ కూటమి ఏర్పాటుతో అధికార బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటిరోజే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఎంజీపీ బయటకు వచ్చింది. లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు ఈ నెల 5న గవర్నర్ మృదులా సిన్హాకు లేఖ రాశారు. 2012లో బీజేపీ, ఎంజీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 21, ఎంజీపీ మూడు స్థానాల్లో గెలిచాయి. -
‘ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చు’
పనాజీ: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానుండగా గోవాలోని బీజేపీ-ఎంజీపీ(మహారాష్ట్రవది గోమంతక్ పార్టీ)ల మధ్య అగాధం మరింత పెద్దదైంది. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కూటమితో అసంతృప్తిగా ఉన్నవారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని అన్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ తన భాగస్వామ్య పార్టీ అయిన ఎంజీపీ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. తమ పార్టీకి చెందిన మంత్రులను రాజీనామా చేయాలని కోరే బదులు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎంజీపీ నేత, రవాణా శాఖ మంత్రి సుదీన్ దావలికార్ ఇటీవల మాట్లాడుతూ పర్సేకర్ పాలనలో గోవా పూర్తిగా వెనుకబడిందన్నారు. రెండున్నరేళ్ల పరిపాలని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కొంత సహనం పాటించిన ముఖ్యమంత్రి పర్సేకర్ చివరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉండి ఆరోపణలు చేయడం కాదని, ఆయనకు నిజంగా అంత ఇబ్బందిగా ఉంటే పదవికి రాజీనామా చేసి బయటకెళ్లి ఆరోపణలు చేసుకోవచ్చిన అన్నారు.