‘ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చు’
పనాజీ: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానుండగా గోవాలోని బీజేపీ-ఎంజీపీ(మహారాష్ట్రవది గోమంతక్ పార్టీ)ల మధ్య అగాధం మరింత పెద్దదైంది. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కూటమితో అసంతృప్తిగా ఉన్నవారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని అన్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ తన భాగస్వామ్య పార్టీ అయిన ఎంజీపీ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. తమ పార్టీకి చెందిన మంత్రులను రాజీనామా చేయాలని కోరే బదులు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా ఎంజీపీ నేత, రవాణా శాఖ మంత్రి సుదీన్ దావలికార్ ఇటీవల మాట్లాడుతూ పర్సేకర్ పాలనలో గోవా పూర్తిగా వెనుకబడిందన్నారు. రెండున్నరేళ్ల పరిపాలని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కొంత సహనం పాటించిన ముఖ్యమంత్రి పర్సేకర్ చివరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉండి ఆరోపణలు చేయడం కాదని, ఆయనకు నిజంగా అంత ఇబ్బందిగా ఉంటే పదవికి రాజీనామా చేసి బయటకెళ్లి ఆరోపణలు చేసుకోవచ్చిన అన్నారు.