పారికర్‌పై మైనింగ్‌ మరక | editorial on goa cm manohar parrikar | Sakshi
Sakshi News home page

పారికర్‌పై మైనింగ్‌ మరక

Published Fri, Feb 9 2018 12:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

editorial on goa cm manohar parrikar - Sakshi

దేశ భూభాగంలో గోవా వాటా ఒక శాతంకన్నా తక్కువే. కానీ అక్కడున్న దట్టమైన అడవులు, నీలాకాశాన్ని తాకుతున్నట్టనిపించే శిఖరాలు, గగుర్పొడిపించే లోయలు, మనోహర సాగర తీరాలు దేశ విదేశాలనుంచి ఏటా దాదాపు 40 లక్షలమంది పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. అలాంటి రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఆదరా బాదరాగా వివిధ సంస్థల మైనింగ్‌ లీజులను పొడిగిస్తూ 2014 నవంబర్‌–2015 జనవరి మధ్య తీసుకున్న నిర్ణయాలు చెల్లవని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం వెలువరించిన తీర్పు పర్యావరణవాదులకు ఊరటనిస్తుంది. అదే సమయంలో గోవాలోని మనోహర్‌ పారికర్‌ నాయకత్వాన గల బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుంది. 

నిజానికి 2007–12 మధ్య ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్‌గా ఉండి మైనింగ్‌ లీజుల్లో సాగుతున్న అవకతవకలను వెలుగులోకి తెచ్చారు. అప్పటి కాంగ్రెస్‌ పాలనలో సాగుతున్న ఈ అక్రమాల వల్ల ఖజానాకు రూ. 25,000 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అనంతరం ఆయన నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ప్రకటించిన కొత్త లీజు విధానం సైతం ఆచరణలో పాత సంస్థలకే మేలు చేకూర్చేవిధంగా ఉన్నదన్న అభిప్రాయం అందరిలో కలిగింది.

పైగా సుప్రీంకోర్టులో మైనింగ్‌ అవకతవకలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో ఉండగానే కొత్త విధానాన్ని ప్రకటించడం, ఆరోపణలు ఎదు ర్కొంటున్న సంస్థలకే మళ్లీ లీజు పొడిగింపునకు అవకాశమీయడం విమర్శలకు తావిచ్చింది. నిజానికి నూతన విధానం అమలు మొదలయ్యాక పారికర్‌ కొద్దికాలం మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు. పారికర్‌ సర్కారు 2014 అక్టోబర్‌ 1న గనులకు సంబంధించిన నూతన లీజు విధానాన్ని అంగీకరించగా అది నవంబర్‌ 4న అమల్లోకొచ్చింది. 

ఆ మర్నాటినుంచి డిసెంబర్‌ 10 వరకూ 16 సంస్థల మైనింగ్‌ లీజులు పొడిగించారు. వాస్తవానికి ఆయన నవంబర్‌ 8న కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా వెళ్లిపోయారు. పారికర్‌ తర్వాత వచ్చిన లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ ప్రభుత్వం సైతం ఆ విధానం కిందే పాత లీజుదారుల గడువు పొడిగించుకుంటూ పోయింది. దీని స్థానంలో వేలం విధానాన్ని రూపొందించాలని ఒకపక్క కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు నిర్ణయిస్తే అందుకు విరుద్ధంగా గోవా లీజు విధానం ఎందుకు ఉందన్నదే ప్రశ్న.  కేంద్రం ముసాయిదా విధానాన్ని ప్రకటించాక సైతం లీజులు పొడిగించడం ఆపకపోవడం, ఆఖరికి గనుల లీజుకు వేలం విధానం అమల్లోకి తెస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ జారీ చేసిన రోజు కూడా ఈ వ్యవహారాన్ని కొనసాగించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. 

సుప్రీంకోర్టు తాజా తీర్పు ద్వారా రద్దు చేసిన 88 లీజు పొడిగింపుల్లో 56 పొడిగింపులు వేలం విధానం ముసాయిదా ప్రకటనకూ, ఆర్డినెన్స్‌ జారీకి మధ్య చోటు చేసుకున్నాయి. మరో 31 పొడిగింపులు ఆర్డినెన్స్‌ జారీ అయిన రోజు ఆమోదం పొందాయి. మైనింగ్‌ లీజులను అంత హఠాత్తుగా, అంత హడావుడిగా ఎందుకు పొడిగించవలసి వచ్చిందో అర్ధం కావడం లేదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు గమనించదగ్గవి. కేంద్రం గనులకు సంబంధించి ముసా యిదా విధానం వెలువరించిందని, అది త్వరలోనే అమల్లోకి రాబోతున్నదని అంచనా వేసుకునే గోవా ప్రభుత్వం ఇలా వ్యవహరించిందన్న అనుమానాలు వ్యక్తం చేసింది. 

వాస్తవానికి పర్యావరణవాదుల ఆందోళనకు ప్రాతిపదిక పారికర్‌ వెలుగులోకి తెచ్చిన అంశాలే. ఈ విషయంలో అన్ని వర్గాల నుంచీ ఒత్తిళ్లు పెరగడంతో కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇనుము, మాంగనీసు వగైరా ఖనిజాల తవ్వకానికి ఎలాంటి మార్గాలు అనుసరిస్తున్నారో, ప్రత్యేకించి గోవాలో చోటుచేసుకుంటున్న అవకతవకలేమిటో వెలికితీయడానికి రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంబీ షా నేతృత్వంలో 2010లో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌ వెలువరించిన మధ్యంతర నివేదికల ఆధారంగా  సుప్రసిద్ధ పాత్రికేయుడు, పర్యావరణవేత్త క్లాడ్‌ ఆల్వారెస్‌ నేతృత్వంలోని గోవా ఫౌండేషన్‌ 2012లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ వ్యాజ్యంలోనే సుప్రీంకోర్టు ప్రస్తుత తీర్పు వెలువరించింది. 

కొండలు, గుట్టలు, నదీనదాలు  వేల సంవత్సరాలనుంచి మనిషికి వారసత్వంగా సంక్రమిస్తున్న ప్రకృతి సంపద. ఆ సంపదను పొదుపుగా, జాగ్రత్తగా వినియోగించుకోవడం... సురక్షితంగా భవిష్య త్తరాలకు అందించడం ప్రజలందరి సమష్టి బాధ్యత. ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించి ఆ బాధ్యతను వారి తరఫున నెరవేర్చవలసిన ప్రభుత్వాలు దురదృష్ట వశాత్తూ తామే ఆ సంపద ధ్వంసానికి కారణమవుతున్నాయి. అసలు ప్రపంచ దేశాలతో పోలిస్తే పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను గుర్తించడంలోనే మనం ఎంతో వెనకబడ్డాం. అందుకొక ప్రత్యేక శాఖ అవసరమని 1985 వరకూ పాలకులు అనుకోలేదు. ఆ తర్వాత సైతం అది నామమాత్రావశిష్టంగానే మిగిలింది. దేశంలో సంస్కరణలకు తలుపులు బార్లా తెరిచాక అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ మధ్య వైరుధ్యం మొదలైంది. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదన్న వాదనలు బయల్దేరుతున్నాయి. 

పర్యావరణ పరిరక్షణ కోసం పాటుబడేవారు పాలకులకు అభివృద్ధి నిరో ధకులుగా, తిరోగమనవాదులుగా, కొన్ని సందర్భాల్లో మావోయిస్టులుగా కన బడుతున్నారు. ఒడిశాలో నియంగిరి కొండలను అల్యూమినియం ఖనిజం కోసం పిండి చేయడాన్ని అడ్డుకుంటున్న సామాజికవేత్త ప్రఫుల్ల సమంతర, ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన రమేష్‌ అగర్వాల్‌వంటివారు పోలీసుల నుంచి, ప్రైవేటు ముఠాల నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులే ఇందుకు ఉదాహరణ. గోవా ప్రభుత్వం లీజుల పొడిగింపు వ్యవహారం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మాత్రమే కాదు... సహజ సంపద వినియోగంలో అనుసరించాల్సిన విధానా లేమిటో నిర్దేశించిన 2014 ఏప్రిల్‌నాటి సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి కూడా విరుద్ధం. సహజ వనరుల వినియోగంలో, కేటాయింపులో పెడ ధోరణులు తలెత్తకుండా తాజా తీర్పు దోహదపడుతుందని ఆశించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement