
గువాహటి: భారత్‌లో కొందరు వ్యక్తులు, కొన్ని బృందాలు గొడవపడే ధోరణితో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇలాంటి శక్తులపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు పైచేయి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అస్సాంలోని గువాహటిలో ఆదివారం హైకోర్టు ఆడిటోరియానికి శంకుస్థాపన చేసిన అనంతరం జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ..‘ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు, గ్రూపులు జగడాలమారితనంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు కొన్ని మినహాయింపులు మాత్రమే. మన న్యాయవ్యవస్థకున్న బలమైన సంప్రదాయాలు, సంస్కృతి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు అన్నివర్గాలకు సాయం చేస్తాయి. జడ్జీలు, న్యాయాధికారులు ఎల్లప్పుడూ ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్లే న్యాయవ్యవస్థ మనుగడ సాగిస్తోంది’ అని పేర్కొన్నారు.
దేశంలో 50 ఏళ్లకు మించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు వెయ్యికిపైగా ఉన్నాయని జస్టిస్ గొగోయ్ తెలిపారు. అలాగే 25 ఏళ్లకు మించి పెండింగ్‌లో ఉన్నవి 2 లక్షలకుపైగా ఉన్నాయన్నారు. ఇలాంటి కేసుల విచారణను సత్వరం పూర్తిచేయాలని జడ్జీలను కోరారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో 90 లక్షల సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 20 లక్షల కేసుల్లో(23 శాతం) సమన్లు కూడా జారీ కాలేదన్నారు. జడ్జీల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న తన ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment