బీజేపీకి ఎదురుదెబ్బ
పణజి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోవాలో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ) కొత్త కూటమి ఏర్పాటు చేసింది. శివసేన, గో సురక్ష మంచ్(జీఎస్ఎం)తో కలిసి కూటమిగా ఏర్పడింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలికట్టుగా పోటీ చేస్తామని మూడు పార్టీలు ప్రకటించాయి. ఈ కూటమి ఏర్పాటుతో అధికార బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటిరోజే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఎంజీపీ బయటకు వచ్చింది. లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు ఈ నెల 5న గవర్నర్ మృదులా సిన్హాకు లేఖ రాశారు. 2012లో బీజేపీ, ఎంజీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 21, ఎంజీపీ మూడు స్థానాల్లో గెలిచాయి.