మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఆగర్భ శత్రువుల్లాంటి పాపార్టీ లతో జట్టుకట్టిన ఉద్ధవ్ ఠాక్రే, అందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. అదను చూసి సొంత పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే చేసిన తిరుగుబాటుతో అటు అధికారమూ కోల్పోయారు. షిండే వర్గానిదేనన్న సిసలైన శివసేన అన్న ఈసీ తాజా నిర్ణయంతో ఇటు తన తండ్రి స్థాపించి, వారసత్వంగా తనకప్పగించి వెళ్లిన పార్టీ కే పరాయి వాడిగా మిగిలిపోయారు! ఇప్పుడిక శివసేన కార్యాలయం, ఆస్తులు, నిధులు తదితరాలన్నీ కూడా షిండే వర్గం పరమవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది...
– సాక్షి, నేషనల్ డెస్క్
శివసేన పేరు, పార్టీ గుర్తు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికే చెందుతాయన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఉద్ధవ్‌కు భారీ ఎదురుదెబ్బే. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కుమారునిగా ఆయనకు ఇంతటి దుస్థితి కొంతకాలం క్రితం ఎవరూ ఊహించనిదే! చివరి ప్రయత్నంగా ఈసీ తీర్పుపై ఉద్ధవ్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కోర్టు తీర్పుపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. కానీ ఈలోపు పార్టీని పూర్తిగా చెప్పుచేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలకు షిండే వర్గం పదును పెడుతోంది.
మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన శాసనసభాపక్ష కార్యాలయాన్ని సోమవారమే స్వాదీనం చేసుకుంది. తాజాగా పార్లమెంటులోని శివసేన కార్యాలయాన్ని కూడా షిండే వర్గానికే కేటాయిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం మంగళవారం పేర్కొంది. ఇదే ఊపులో శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం, ముంబైతో పాటు మహారాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ప్రాంతీయ కార్యాలయాలు, ఇతర ఆస్తులు, సొంత పత్రిక సామ్నాతో పాటు పార్టీ నిధులను కూడా సొంతం చేసుకుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉద్ధవ్ వర్గం అదీనంలో ఉన్న పార్టీ ఆస్తుల అప్పగింత కోరబోమని షిండే గతంలో చెప్పినా దానికిప్పుడు కట్టుబడబోరని పరిశీలకులు అంటున్నారు.
‘‘ఇలాంటి ఆస్తుల తాయిలాలకు లొంగినవారే 2019లో అధికార లాలసతో తప్పటడుగు వేశారు. ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ ఆగర్భ శత్రువులైన పార్టీలతో జట్టుకట్టారు. అందుకే ఆస్తులు, పార్టీ నిధులపై మాకెలాంటి ఆశా లేదు. కేవలం బాల్‌ఠాక్రే ఆదర్శాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా ఏకైక లక్ష్యం’’ అని అప్పట్లో షిండే పదేపదే చెప్పుకొచ్చారు. అయితే, ‘‘మా తిరుగుబాటులో న్యాయముందని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడమే మా నాయకుని వ్యాఖ్యల అంతరార్థం. అంతే తప్ప న్యాయంగా మాకు దక్కాల్సిన వాటిని వదులుకునే ప్రశ్నే లేదు’’ అని షిండే వర్గం కుండబద్దలు కొడుతోంది.
శివసేనపై సర్వం సహా హక్కులు తమవేనని రుజువు చేసుకోవడం కోసమైనా భవనాలు, ఆస్తులు తదితరాలన్నింటినీ వీలైనంత త్వరగా తమపరం చేసుకోవడమే సరైందని ఆయన వర్గం గట్టిగా భావిస్తున్నట్టు సమాచారం.
పార్టీ నిధుల మాటేమిటి?
గ్రాంట్లు, విరాళాలు, చందాలు, పత్రిక విక్రయాలు తదితరాల రూపేణ శివసేనకు 2020–21లో రూ.13 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్టు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికను బట్టి తెలుస్తోంది. ఇవి తమకే చెందుతాయని షిండే వర్గం కోరవచ్చు. దీన్ని ఊహించే ఈ నిధులను ఉద్ధవ్ ఇప్పటికే వేరే ఖాతాలకు మళ్లించినట్టు చెబుతున్నారు. దీనిపైనా కీచులాట తప్పకపోవచ్చు.
అనుబంధ సంఘాలు
ఇక శివసేన అనుబంధ సంఘాలైన స్థానీయ లోకాధికార్ సమితి, భారతీయ కామ్‌గార్ సేన వంటివి సంఘాలు, విభాగాలుగానే పరిగణనలోకి వస్తాయే తప్ప పార్టీగా కాదు. కనుక వీటి యాజమాన్యం ఎవరిదన్నది కేంద్ర కారి్మక చట్టాల ఆధారంగా తేల్చాల్సి ఉంటుందని శివసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సేన ప్రాంతీయ కార్యాలయాలు
శివసేనకు ఆయువుపట్లుగా భావించే పార్టీ ప్రాంతీయ కార్యాలయాలు (శాఖలు) ముంబై, పరిసర ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. వీటిని వీలైనంత త్వరగా స్వా«దీనం చేసుకునే దిశగా షిండే వర్గం పావులు కదుపుతోంది. అయితే దీనికి చెక్ పెట్టేందుకు శాఖలను శివాయ్ సేవా ట్రస్ట్‌కు బదలాయించాలని ఉద్ధవ్ వర్గం భావిస్తున్నట్టు సమాచారం.
ఇందులో భాగంగా, ముంబై వెలుపల ఉన్న శాఖలు చాలావరకు ఆయా శాఖా ప్రముఖ్‌లు (స్థానిక మండళ్లు), ట్రస్టుల పేరిటే ఉన్నాయని ఉద్ధవ్ వర్గం ఇప్పటికే గట్టిగా వాదిస్తోంది. అవి తమకే చెందాలని షిండే వర్గం గానీ, మరెవరు గానీ కోరడానికి అవకాశం లేదని ఉద్ధవ్ సేన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ చెబుతున్నారు. ఈ లెక్కన ప్రాంతీయ కార్యాలయాల విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య సంఘర్షణ తప్పేలా కన్పించడం లేదు.
శివసేన భవన్
శివసేన ప్రధాన కార్యాలయం. ముంబైలో ఉంది. షిండే వర్గమే అధికారిక శివసేనగా రుజువైతే ఈ భవనం వారికే సొంతం కావాలి. కానీ అది శివసేన ట్రస్టు యాజమాన్యంలో ఉండటం అడ్డంకిగా మారేలా కని పిస్తోంది. పైగా దీని సారథి సుభాష్ దేశాయ్ ఠాక్రేల కుటుంబానికి విధేయుడు.
అంతేగాక ఉద్ధవ్, దేశాయ్‌తో పాటు ట్రస్టీలుగా ఉన్న మిగతా నలుగురూ ఉద్ధవ్ అనుయాయులే! అంతమాత్రాన శివసేన భవన్ ఉద్ధవ్ వర్గం చెప్పుచేతుల్లోనే ఉంటుందని కూడా చెప్పలేని పరిస్థితి! ఎందుకంటే ట్రస్టు ఆస్తిగా ఉన్న భవనాన్ని దశాబ్దాల పాటుగా రాజకీయ పార్టీ కార్యాలయంగా వాడుకోవడం మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్టుల చట్టం నిబంధనలకు విరుద్ధం. అధికారంలో ఉన్న షిండే వర్గం ఈ కోణం నుంచి నరుక్కొస్తే భవన వివాదంపై పీటముడి పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిపై ఓ న్యాయవాది ఇప్పటికే కోర్టుకెక్కారు కూడా. ఆ కేసులో ఉద్ధవ్ వర్గం వాదనలు విని పించాల్సి ఉంది.
సామ్నా ఎవరికో?
శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్థాపించిన సామ్నా అప్పట్లో మహారాష్ట్ర రాజకీయాల్లోనే గాక దేశవ్యాప్తంగా కూడా సంచలనమే. ముఖ్యంగా తీవ్ర పదజాలంతో బాల్ ఠాక్రే రాసే సంపాదకీయాలు, విమర్శనాత్మక కథనాలు, మరీ ముఖ్యంగా వ్యంగ్య కార్టూన్లు జాతీయ స్థాయిలో సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారేవి.
దానితో పాటు కార్టూన్ మేగజైన్ మార్మిక్ ను కూడా శివసేన వెలువరిస్తోంది. ఈ పత్రికలు, వాటి కార్యాలయాల యాజమాన్యం షిండే వర్గం చేతికి రావడం కష్టంగానే కని పిస్తోంది. ఎందుకంటే అవి కూడా పార్టీ అజమాయిషిలో కాకుండా ప్రబోధన్ ప్రకాశన్ అనే ట్రస్టు యాజమాన్యంలో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment