అమ్మో ... ఆయన్ని నమ్మలేం బాబూ!!
'ఆయనని అస్సలు నమ్మలేం. ఆయన ఎవరినీ నమ్మలేం. ఆయన పరిపాలనే భయం, బెదిరింపుల మయం. ఆయన అధికారాన్ని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంటాడు' అమెరికన్ కాన్సులేట్ అధికారి ఒకాయన గుజరాతమ్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీకి ఇచ్చిన సర్టిఫికేట్ ఇది.
అమెరికా అధికారి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ట్విట్టర్ లోకంలో సంచలనం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, మోదీ వ్యతిరేకులు దీన్ని రీట్వీట్ చేసి, కామెంట్ చేసి మరీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోదీ మద్దతుదారులు మాత్రం 'మోదీకి అమెరికా సర్టిఫికేట్ అవసరం లేదు. మోదీ ఎలాంటి వాడో మాకందరికీ తెలుసు' అని వాదిస్తున్నారు.
వికీలీక్స్ ట్విట్టర్ హ్యాండిల్ లోనరేంద్ర మోదీ పనితీరుపై అమెరికా కాన్సుల్ జనరల్ మైకెల్ ఓవెన్ చేసిన కామెంట్లు ఈ వివాదానికి కారణం. 'మోదీ మాటలు తీయగా ఉంటాయి. ఆయన వ్యవహార శైలి హాయిగా ఉంటుంది. కానీ ఆయన కొద్ది మంది నమ్మకస్తులైన సలహాదారులు తప్ప మరెవరి మాటలను వినరు' అని ఓవెన్ అన్నట్టు వికిలీక్స్ తెలిపింది. మోదీ చాలా దురుసుగా వ్యవహరిస్తారని, ఆయన తీసుకునే నిర్ణయాలు మంత్రివర్గ సహచరులకు కూడా తెలియవని అమెరికన్ అధికారి అన్నారు.
అయితే మోదీ పైకెదగడం ఖాయం కాబట్టి ఆయనను పదేపదే కలవడం అవసరమని ఓవెన్ అనడమే కొనమెరుపు.