పెరటి పంటకు ఓ రోబో!
ఆరోగ్యమైన ఆహారం కోసం ఇటీవలి కాలంలో చాలామంది ఇంటి, పెరటి పంటలపై ఆధారపడుతున్నారు. కాలుష్యం లేని సేంద్రీయ ఆహారానికి ఇదో మేలైన మార్గమే. అయితే అందరికీ అంత సమయం, తీరిక, నైపుణ్యం ఉండకపోవచ్చు. ‘అలాంటివాళ్ల కోసం ఫార్మ్బోట్ జెనిసిస్ సరిగ్గా సరిపోతుంది అంటోంది’ కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మ్బోట్ ఇన్కార్పొరేషన్. దాదాపు పదడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ఉండే ఈ ఆటోమెటిక్ పొలంలో మీరు చేయాల్సిన పని ఒక్కటే. పండిన పంటను ఎంచక్కా వంటలో వాడుకోవడం! మిగిలినవన్నీ ఇందులో ఉండే రోబో చక్కబెట్టేస్తుంది.
ఏకకాలంలో దాదాపు అన్నిరకాల పంటల్ని ఒకేచోట పండించుకోవడం దీనికున్న మరో ప్రత్యేకత. విత్తనాలు వేయడం మొదలుకొని మొక్కలకు నీళ్లు పట్టడం, కలుపు తీయడం. అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు ఎరువుల్ని వేయడం అన్నీ ఈ ఫార్మ్బోట్ జెనిసిస్లోని యంత్రం పూర్తి చేస్తుంది. ఇందుకోసం దీంట్లో ఒక సూక్ష్మ కంప్యూటర్ (రాస్ప్బెర్రీ పై) మరో మైక్రో కంట్రోలర్ (ఆడ్రినో)లతోపాటు 12 రకాల యంత్రాలు (విత్తులు, నీరు, కలుపుతీత వంటివన్నమాట) ఏర్పాటు చేశారు. పరిస్థితులకు తగ్గట్టుగా మొక్కలకు నీళ్లు పెట్టడం, కలుపు మొక్కల్ని గుర్తించి అక్కడికక్కడే వాటిని నాశనం చేయడం ఫార్మ్బోట్ జెనిసిస్ ప్రత్యేకతల్లో కొన్ని మాత్రమే. మరిన్ని వివరాలకు https://farmbot.io/ వెబ్సైట్ చూడండి.