ఒరాకిల్ చేతికి మైక్రోస్ సిస్టమ్స్
న్యూయార్క్: సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ క్లౌడ్ సంస్థ మైక్రోస్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు 5.3 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు వెల్లడించింది. తద్వారా హోటల్, రెస్టారెంట్ విభాగాల్లో డేటా సంబంధిత సేవలను విస్తరించనుంది. 2009లో సన్ మైక్రోసిస్టమ్స్‌ను కొనుగోలు చేశాక ఒరాకిల్ చేపట్టిన అతిపెద్ద కొనుగోలు ఇదే కావడం గమనార్హం. తమకున్న 39 బిలియన్ డాలర్ల నగదు నిల్వల నుంచి మైక్రోస్ సిస్టమ్స్ కొనుగోలుకి ఒరాకిల్ నిధులను సమకూర్చుకోనుంది. మైక్రోస్కు హోటళ్లు, రెస్టారెంట్లు, కాసినో, లీజర్ తదితర విభాగాల నుంచి 5,67,000 మంది కస్టమర్లున్నారు. 180 దేశాలలో సేవలను విస్తరించింది.